కరోనా సంక్షోభంలో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రయోగించిన 'ఆత్మనిర్భర్ భారత్' అస్త్రం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కేంద్రబిందువుగా నిలిచింది. 90 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వివిధ రంగాల్లో జరగనున్న దేశాభివృద్ధిపై కీలక విషయాలను వెల్లడించిన మోదీ.. స్వావలంబనవైపు భారత్ పరుగులు తీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సంకల్పాన్ని కరోనా వైరస్ అడ్డుకోలేదని స్పష్టంచేశారు.
ఆత్మనిర్భర్ మంత్రం...
ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రపంచంతో మరింత మమేకం కావడమని ప్రధాని తెలిపారు. దిగుమతులు తగ్గించుకుని, ముడి సరకు స్థానంలో పూర్తిగా తయారైన వస్తువులను ఎగుమతి చేసే విధంగా దేశం ఎదగాలని.. ఇందుకు ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ వరల్డ్' మంత్రాలను అనుసరిస్తూ దేశం ముందుకు సాగాలని సూచించారు.
ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయులకు ఓ మంత్రంగా మారిందన్నారు మోదీ. ఇన్ని రోజులు ఓ కలగానే మిగిలిపోయిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ప్రతిజ్ఞగా మారుతోందని తెలిపారు.
ఇదీ చూడండి:-ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
లక్ష సవాళ్లు.. కోటి పరిష్కారాలు...
ఆత్మనిర్భర్ భారత్ సాధన విషయంలో లక్షలాది అనుమానాలు, సవాళ్లున్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించేందుకు కోటికిపైగా పరిష్కారాలను చూపగల శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని.
ఈ నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్‌ను ప్రస్తావించారు ప్రధాని. లోకల్ కోసం వోకల్‌గా మారాల్సిన తురణం ఆసన్నమైందని నొక్కిచెప్పారు. భారత వస్తువులను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలని నిర్దేశించారు.
వ్యవసాయంలోనూ...
వ్యవసాయంలో స్వావలంబన, రైతులు స్వయం సమృద్ధత సాధించడం ఆత్మనిర్భర్ భారత్ ప్రాధాన్యం అని తెలిపారు ప్రధాని. రైతులకు ఆధునిక వసతులను కల్పించడం కోసమే లక్ష కోట్ల రూపాయలతో 'వ్యవసాయ మౌలిక వసతుల నిధి'ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే...
కరోనా సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న కరోనా యోధులపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ప్రజల సంకల్పంతో వైరస్‌నే వైరస్‌పై విజయం సాధించవచ్చన్నారు.