సరిలేరు 'కేజ్రీ'కెవ్వరూ.. దిల్లీ పీఠంపై ఆప్ 'హ్యాట్రిక్' దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అద్భుత విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. ఫలితాల్లో సత్తా చాటింది. మొత్తం 70 స్థానాలకుగాను 62 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. దిల్లీలోని మొత్తం 11 జిల్లాల పరిధిలోనూ.. ఆమ్ ఆద్మీ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.
న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘన విజయం సాధించారు. పట్‌పడ్‌గంజ్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జయకేతనం ఎగురవేశారు.
ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ తుది ఫలితాలు పార్లమెంట్లో అహో.. అసెంబ్లీలో అయ్యో
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దిల్లీలోని ఏడు స్థానాలనూ కైవసం చేసుకున్న భారతీయ జనతాపార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోర్లా పడింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను ఎనిమిది చోట్ల మాత్రమే భాజపా అభ్యర్థులు గెలిచారు.
2014నాటి లోక్సభ ఎన్నికల్లోనూ దిల్లీలో అద్భుత ఫలితాలు రాబట్టిన భాజపా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 3చోట్ల మాత్రమే గెలిచి.. ఘోర పరాజయం మూటగట్టుకుంది. తాజా ఎన్నికల్లోనూ కమలం పార్టీకి అదే తరహా ఫలితాలు వచ్చాయి. దిల్లీలోని 11 జిల్లాల్లో.. ఒక్క జిల్లాలోనూ భాజపా ఆధిపత్యం కనబర్చలేకపోయింది.
ప్రజాదరణ తగ్గలేదు
2015 ఎన్నికల్లో 67చోట్ల గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ... ప్రజాదరణ పెద్దగా తగ్గలేదని స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నాలుగు స్థానాలు తగ్గినప్పటికీ వరుసగా రెండోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, 2015నాటి ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకొని సీఎం పగ్గాలు అందుకున్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో వరుసగా మూడోసారి దిల్లీ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : ఆప్ కీ దిల్లీ: మరోసారి దిల్లీ పీఠంపై 'సామాన్యుడు'