వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్‌షోలో అనుమతికి మించి ఖర్చు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు ఆమ్ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్. ఎన్నికల నిబంధనల ప్రకారం ఖర్చు పరిమితి రూ. 70 లక్షలకు మించొద్దని పేర్కొన్న ఆయన.. మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రికంలో ప్రధాని మోదీ.. వారణాసి లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ఉన్నారు.
వారణాసి ఎన్నికల అధికారికి లేఖ రాసిన సంజయ్ సింగ్ అందులో ఖర్చుల వివరాల్ని ప్రస్తావించారు. నిబంధనలు ఉల్లంఘించి మొత్తం రూ. కోటీ 27 లక్షలు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
భాజపా నాయకులు వారణాసి చేరుకోవడానికి ఉపయోగించిన ప్రైవేటు జెట్లకు రూ. 64 లక్షలు ఖర్చు చేశారని, వాణిజ్య విమానాల ద్వారా వచ్చిన 100 మందికి పైగా నేతలకు రూ. 15 లక్షలు వెచ్చించారని ఆరోపించారు.