దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మూడోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించిన ఆమ్ ఆద్మీ.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 'రాష్ట్ర నిర్మాణ్' పేరుతో చేపట్టే ఈ ప్రచారాల ద్వారా కొత్తగా కోటి మందిని పార్టీలోకి చేర్చాలని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్.
ఆదివారం రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు దిల్లీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాయ్.. మిగతా మంత్రివర్గ సభ్యులతో కలిసి దిల్లీ ఆప్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. మొత్తం మూడు దశల్లో.. 'రాష్ట్ర నిర్మాణ్' చేపట్టాలని పార్టీనేతలు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.
" మొదటగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఆప్ నేతలు ప్రచారాలు ప్రారంభిస్తారు. రెండో దశలో 9871010101 ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి 'రాష్ట్ర నిర్మాణ్' ప్రచారంలో భాగమవ్వాలని ప్రజలను ఆహ్వానిస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టర్లు విడుదల చేస్తాం.
మూడోదశలో ఆప్ పార్టీలో చేరడం ద్వారా దేశనిర్మాణం ఎలా చేపట్టొచ్చన్న సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ.. అన్ని రాష్ట్రాల్లోని ఆప్ అధ్యక్షులు, కార్యకర్తలు.. ఆయా రాష్ట్రాల్లోని రాజధానుల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రధాన నగరాల్లోనూ విలేకరుల సమాశేవాలు ఏర్పాటు చేస్తారు."
- గోపాల్ రాయ్, ఆప్ సీనియర్ నేత