తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హస్తినలో ఆప్​, కాంగ్రెస్​ పొత్తుపై సందిగ్ధత వీడేనా?

సార్వత్రిక ఎన్నికల వేళ దిల్లీ రాజకీయం వేడెక్కింది. తాజాగా ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్​, దిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు పీసీ చాకో​తో భేటీ అయ్యారు. భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇరుపార్టీలు పొత్తులపై చర్చించినట్లు సమాచారం.

ఆప్​, కాంగ్రెస్ పొత్తు కుదిరేనా?

By

Published : Apr 4, 2019, 3:53 PM IST

దిల్లీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు ఆప్​తో పొత్తుకు ససేమిరా అంటున్న కాంగ్రెస్ కాస్త​ మెత్తబడింది. తాజాగా ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​, దిల్లీ కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జ్​ పీసీ చాకోతో భేటీ అయ్యారు. లోక్​సభ సీట్ల సర్దుబాటుపై ఇరువురు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మోదీ (భాజపా) ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆప్​ భావిస్తోంది. అందుకు కాంగ్రెస్​తో చెలిమి చేయడానికి ముందుకొచ్చింది. దిల్లీలోని 7 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్​కు 2 సీట్లు కేటాయించడానికి ఆప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కాంగ్రెస్​ 3 సీట్లు కావాలని పట్టుబట్టింది. దిల్లీ, చాందినీ చౌక్​, ఈశాన్య దిల్లీ స్థానాలు కావాలని తేల్చిచెప్పింది.

తాజాగా ఆప్​ చేసిన​ ప్రతిపాదనలను చాకో.. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి చేరవేశారు. మరికొద్ది రోజుల్లో రాహుల్​ ఆప్​తో పొత్తుపై ఓ నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా దిల్లీలోని అన్ని (7) లోక్​సభ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో సీట్లు రాకున్నా భాజపాతో పోల్చితే కాంగ్రెస్, ఆప్​లకు కలిపి పోలైన ఓట్లు ఎక్కువ. అందువల్ల ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి ఇరుపార్టీలు కూటమిగా ఏర్పడడం అనివార్యమైంది.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా ఆప్​, కాంగ్రెస్​ పనిచేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు పొత్తు కుదుర్చుకోలేకపోయాయి. కాంగ్రెస్​తో పొత్తుకు ఆప్​ సిద్ధంగా ఉంది. షీలా దీక్షిత్​ వర్గం మాత్రం ఆప్​తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆప్​తో పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్​కే నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details