ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. శివసేన పార్టీలో నవోదయాన్ని ఉరకలెత్తించిన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే.. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఇవాళ ప్రమాణం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ నిర్ణయాలతో పాటు పార్టీ నిర్మాణంలోనూ ఆదిత్య కీలకంగా వ్యవహరించనున్నారు. తాత బాల్‌ఠాక్రే, తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నుంచి అనేక లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆదిత్య.. వర్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు.
తండ్రికి తోడుగా ఆదిత్య- ఇక 'మహా' పాలనలోనూ కీలక పాత్ర - Aaditya Thackeray joins dad in Maharashtra ministry
ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి విజయఢంకా మోగించారు. ఆయనే సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే. అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన ఆయన.. ఇవాళ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న కాలంలో పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా నిలవనున్నారు.
29 ఏళ్ల ఆదిత్య తాతలానే కళాకారుడు. తండ్రి ఉద్ధవ్‌లా ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. కవితలు కూడా రాస్తారు. 'మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్' పేరిట ఆదిత్య రాసిన కవితా సంపుటిని 2007లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. 'ఉమ్మీద్' అనే ప్రైవేట్ ఆల్బమ్‌కు ఆదిత్య పాటలు కూడా రాశారు. 2010 వరకూ ఓ కళాకారుడిగానే ప్రపంచానికి తెలిసిన ఆదిత్య.. 2010లో తొలిసారి ఠాక్రేల వారసత్వాన్ని ప్రదర్శించారు. యూనివర్శిటి ఆఫ్ ముంబైలో ఆంగ్ల సాహిత్యం పాఠ్యాంశంగా రోహిన్‌టన్ మిస్త్రీ రచించిన 'సచ్ ఏ లాంగ్ జర్నీ' పుస్తకానికి వ్యతిరేకంగా ఆదిత్య ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి యువసేన అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
పోరాటాలకు వెనుకాడని ఆదిత్య
న్యాయవిద్య కూడా పూర్తి చేసిన ఆదిత్య ఎక్కువగా ప్రజాసమస్యలు, యవత సమస్యలపై గళమెత్తుతూ ఉంటారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ.. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆదిత్యఠాక్రే పోరాటం కూడా ఓ కారణం. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబయిలో రాత్రిళ్లు కూడా వాణిజ్య సముదాయాలు తెరిచే ఉండాలంటూ ఆదిత్య ఉద్యమం తీసుకొచ్చారు.