ఐదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందిన ఈసూరు గ్రామం "స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేశాం కానీ... ఎక్కడో ఏదో భయం. బ్రిటిష్ వారు మమ్మల్ని ఏం చేస్తారోనన్న ఆందోళన. కానీ అలాంటిదేం జరగలేదు."
1947 ఆగస్టు 15. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. కానీ.. కర్ణాటకలోని ఓ గ్రామం మాత్రం అంతకన్నా ఐదేళ్ల ముందే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. దేశ చరిత్రలోనే "ఈసూరు" పల్లె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అలా సాధ్యమైంది...
1940లలో స్వాతంత్ర్య సంగ్రామం కీలక దశకు చేరుకుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమించింది.
ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు కర్ణాటక శివమొగ్గ జిల్లా ఈసూరు గ్రామ ప్రజలు మరో అడుగు ముందుకేశారు. 1942 ఆగస్టు 12న బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కట్టేందుకు నిరాకరించారు. స్వాతంత్ర్యం ఇచ్చి తీరాల్సిందేనని నినదించారు.
"మేము స్వాతంత్ర్య సమరయోధులమని చెప్పాం. స్వతంత్రం ప్రకటించాలని కోరాం. అనూహ్యంగా బ్రిటిష్ వారు మా డిమాండ్ ను అంగీకరించారు. గ్రామం విడిచి వెళ్లిపోయారు."
-ఈసూరు గ్రామ ప్రజలు
1942 ఘటనలో భాగస్వామి అయిన హుచురాయప్పకు ఇప్పుడు 113 సంవత్సరాలు. అప్పటి విషయాలు ఆయన మాటల్లో...
ఐదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందిన కన్నడ గ్రామం
"ఆగస్టు 12న ఊరి ప్రజలంతా సంత దగ్గర గుమిగూడాం. పన్నుల వసూళ్ల కోసం బ్రిటిష్ వారు అక్కడికి వచ్చారు. ఇచ్చేందుకు మా దగ్గర ఏమీ లేదు. అందుకే తెగించి.. ఏమీ ఇవ్వమని చెప్పాం. సార్వభౌమాధికారం ఇవ్వాలని కోరాం. ఖాకీ దుస్తులు ధరించిన మేమంతా... మమ్మల్ని మేము స్వాతంత్ర్య సమరయోధులుగా చెప్పుకున్నాం.
స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేశాం కానీ... ఎక్కడో ఏదో భయం. బ్రిటిష్ వారు మమ్మల్ని ఏం చేస్తారోనన్న ఆందోళన. కానీ అలాంటిదేం జరగలేదు. అనూహ్యంగా ఆంగ్లేయులు మా డిమాండ్ ను అంగీకరించారు. మా గ్రామానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఊరు విడిచి వెళ్లిపోయారు".
- హుచురాయప్ప, గ్రామస్థుడు
1942 సెప్టెంబర్ 29న.. మరో కీలక పరిణామానికి ఈసూరు వేదికైంది. నెలన్నర క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయిన బ్రిటిష్ సైనికులు... తిరిగి ఊరులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. భద్రేశ్వర్ ఆలయంపై త్రివర్ణ పతాకం ఎగరవేసి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు.
ఐదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందిన కన్నడ గ్రామం ఈసూరు ఘటన తర్వాత చుట్టుపక్కల ఊళ్లలో స్వాతంత్ర్యం కాంక్ష మరింత బలపడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని ఆంగ్లేయులు గుర్తించారు. అగ్నికి ఆజ్యంపోసిన ఈసూరుపై తిరిగి పట్టుసాధించాలని భావించారు.
కొన్నాళ్ల తర్వాత ఈసూరు గ్రామంలో భారీ సంఖ్యలో బ్రిటిష్ సైనికుల్ని మోహరించారు. ఈసూరు వాసులకు, బ్రిటిష్ జవాన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఘర్షణల్లో ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారి మరణించారు. 50మంది గ్రామస్థులు అడవుల్లోకి పారిపోయారు. కొద్దిరోజులకే బ్రిటిష్ సైన్యం వారిని అరెస్టు చేసింది.
ఈసూరు ఘటన అందరిలో స్ఫూర్తి నింపింది. చిన్నారులు, మహిళలనే తేడా లేకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో భాగస్వాములయ్యారు. ఉద్యమం ఉద్ధృత రూపు దాల్చింది. ఐదేళ్ల తర్వాత భారత్ కు స్వతంత్రం సిద్ధించింది.
ఇదీ చదవండి:'వీరుల త్యాగాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలి'