ఓవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభణ చూసి యావత్‌దేశం కలవర పడుతూంటే.. ఆ రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేనట్టుంది. అందుకే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను తుంగలో తొక్కుతున్నాయి. వైద్యం కోరి వచ్చిన రోగుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ముంబయి కెమ్(కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. కరోనాతో మృతిచెందిన వారి శవాల మధ్యే ఇతర రోగులకు చికిత్స అందిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఎటు చూసినా.. నిర్లక్ష్యమే
పరేల్‌లోని కెమ్ ఆసుపత్రిలో భౌతిక దూరం మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస వసతులు లేక రోగులు నేలపై పడి ఉన్నారు. అంతే కాదు, 20(ఏ) వార్డులో కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సాధారణ రోగుల మధ్యే నిర్లక్ష్యంగా వదిలేసిన దృశ్యాలు వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కరోనా లేని వారికి సైతం వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
కెమ్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందినవారి శవాలపై కప్పే బాడీ బ్యాగ్‌లు ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న ఓ వీడియోను భాజపా ఎమ్మెల్యే నితేశ్ రాణే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై కెమ్ యాజమాన్యం స్పందించలేదు.
అయితే, ఆ వీడియోలు ఎప్పటివో అయి ఉండొచ్చని.. ప్రస్తుతం ఆసుపత్రలు జాగ్రత్తలు తీసుకుంటున్నయని పేర్కొన్నారు శివసేన నేత అనిల్ దేశాయ్.