కరోనా వైరస్ విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది వలసకూలీలు ఉపాధి కోల్పోయారు. పని చేస్తేనే పట్టెడన్నం తినే వీరు.. ఎలాంటి పనులు లేక పస్తులున్నారు. కొంతమంది స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. మరికొందరు ప్రభుత్వం నడుపుతున్న శ్రామిక రైళ్లలో ఇళ్లకు వెళ్తున్నారు. అయితే ప్రయాణ సమయంలో సరిగా ఆహారం దొరకని వారి పరిస్థితికి.. ఈ వీడియో ఓ ఉదాహరణ!
ఆకలిరాజ్యం సీన్ రిపీట్..
సొంతూళ్లకు వెళ్లేందుకు పలువురు వలస కూలీలు మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం డివిజన్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. శ్రామిక్ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వచ్చిన వీరంతా అక్కడకు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్ చేసిన ఆహారం, బ్రెడ్ మొదలైనవి అధికారులు ఒక ట్రాలీలో తీసుకొచ్చారు. అది చూసిన వెంటనే వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు. రైలు ప్రయాణ సమయంలో ఇవ్వడానికి తెచ్చిన ఆహారమని ఇప్పుడు ఇవ్వమని అధికారులు చెప్పినా.. ఒకరిద్దరు కూలీలు ధైర్యం చేసి ఆ ఆహారం ప్యాకెట్లను తీసుకున్నారు.
అక్కడే ఉన్న మిగిలిన కూలీలు కూడా ఒక్కసారిగా ట్రాలీపై పడి, ఎవరి చేతికి దొరికిన ఆహారాన్ని వారు లాక్కొనిపోయారు. ఒకరి చేతిలో ఉన్న ఆహారాన్ని మరొకరు తీసుకునేందుకు కుమ్ములాడుకున్నారు. ఈ సందర్భంగా పలువురి మధ్య తోపులాట జరిగింది. ఈ చర్యతో ఒక్కసారిగా షాకైన అధికారులు ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేని సమయంలో ఇది జరిగిందని అధికారులు తెలిపారు.