పౌరసత్వంపై రగడ... ఎన్ఆర్సీపై ఆందోళన... ఆర్థిక మాంద్యంపై అనుమానం.... ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య చిక్కుకుంది దేశ సామాజిక-రాజకీయ ముఖచిత్రం. ఇలాంటి పరిస్థితుల మధ్య శాసనసభ ఎన్నికలకు సిద్ధమైంది దిల్లీ. ఈనెల 8న పోలింగ్‌కు ముహూర్తం. 11న ఫలితం. హస్తిన ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరం. స్థానిక అంశాలకే పరిమితం అవుతుందా? జాతీయ వ్యవహారాలపై ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుందా?
అందుకే ఈ తీర్పు కీలకం...
దిల్లీ... దేశ రాజధాని. అక్కడ అధికారం ఎవరిదన్న అంశం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ ఎన్నిక మరింత ప్రత్యేకం. ఎందుకంటే... దేశ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన 3 కీలక విషయాలపై హస్తిన తీర్పుతో స్పష్టత వచ్చే అవకాశముంది. అవి..
- ఓటు విషయంలో ప్రజల ఆలోచనా శైలి
- 'ప్రత్యామ్నాయ రాజకీయాలు' భారత్‌లో నెగ్గి నిలబడతాయా?
- భారత్‌లో సమాఖ్య స్ఫూర్తి ఎలా ఉండబోతుంది?
ఎన్నికల విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు దిల్లీ ఓటర్లు. స్థానిక, జాతీయ స్థాయి అంశాల(నేరుగా చెప్పాలంటే... శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల) మధ్య వ్యత్యాసం చూపిస్తుంటారు. ఇది ఆమ్ఆద్మీ పార్టీకి కలిసివచ్చే విషయమే. ఎందుకంటే ఆ పార్టీ వ్యూహాలన్నీ స్థానిక సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంటాయి.
దిల్లీ ప్రజల ఆలోచనలను మార్చడానికి భాజపా ఈసారి గట్టి ప్రయత్నాలే చేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, కేంద్రంలో తమ(మోదీ సర్కార్) ప్రదర్శనను ప్రచారాస్త్రంగా మల్చుకుని ప్రజల్లోకి వెళ్లింది. రాష్ట్రం-కేంద్రంలో ఒకే విధమైన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నది కమలదళం వాదన.
ప్రభుత్వ పనితీరుపైనే ఆధారపడి అరవింద్ కేజ్రీవాల్ ప్రచార క్షేత్రంలో ముందుకుసాగుతున్నా.... భాజపా మాత్రం జాతీయవాదాన్నే జపిస్తోంది. ఆప్, కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాలు పట్టవంటూ పదేపదే ప్రచారం చేస్తోంది.
అభివృద్ధి మంత్రమే కీలకం...
అభివృద్ధి... రాజకీయాల్లో ఎంతో శక్తిమంతమైన హామీ. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకోగల వాగ్దానం. ఇందుకు 'గరీబీ హఠావో', సబ్ కా సాత్- సబ్ కా వికాస్' వంటి నినాదాలే మంచి ఉదాహరణలు.
ఆప్ మాత్రం విచిత్ర పరిస్థితుల్లో ఆవిర్భవించింది. ధనం, కండబలం, వారసత్వం-గుర్తింపు ఉంటేనే రాజకీయాల్లో ఉండగలం అనే వాదనను చెరిపివేసింది.
2013లో భారీస్థాయిలో విజయాన్ని అందుకున్న ఆప్.. రాజకీయ దిశను మార్చేసింది. అప్పటివరకు డబ్బు ఆధారంగా సాగే రాజకీయాలు.. సేవా పథంవైపు మళ్లాయి. అభివృద్ధి పథకాలతో సమాజంలోని వేర్వేరు వర్గాలకు చేరువైంది ఆప్.
వేర్వేరు వర్గాలు అంటే... దిగువ, మధ్యతరగతి, సంపన్న శ్రేణి ప్రజలు. ఈ 3 వర్గాల గురించి సామాజికవేత్తలు అమిత్ అహుజ, ప్రాదిప్ చిబ్బెర్ ఓ విశ్లేషణ చేశారు. దాని ప్రకారం... ఆర్థికంగా వెనకపడిన వర్గాలు ఓటును తమ హక్కుగా భావిస్తారు. రాష్ట్ర వనరులను పొందేందుకు ఎన్నికలను అస్త్రంగా చేసుకుంటున్నాయి మధ్యతరగతి వర్గాలు. ధనికులు మాత్రం పౌర విధులను దృష్టిలో పెట్టుకునే ఓటు వేస్తున్నారు. ఇలా 3 విభిన్నమైన వర్గాల మద్దతు సంపాదిస్తూ ఇక్కడి వరకు వచ్చింది ఆప్. కానీ ఇలా ఎంతకాలం జరుగుతుందనేది కీలక అంశం.