ట్రాన్స్‌జెండర్ అమ్మగా మారింది.. బాక్సర్లుగా తీర్చిదిద్దింది! ఎదుటివారిని నొప్పించేంత తప్పేమీ చేయకపోయినా... ఇప్పటికీ ట్రాన్స్జెండర్లంటే చాలామందికి చిన్నచూపే. అలాంటి వారికి సరైన సమాధానమిచ్చింది కర్ణాటక మైసూర్‌కు చెందిన అక్రమ్. ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకుని ఆలనా పాలనా చూడడమే కాదు.. వారిని జాతీయ స్థాయి బాక్సర్లుగా తీర్చి దిద్దింది. మనస్సుకు పడ్డ శిక్ష
భిక్షాటన చేసే ట్రాన్స్జెండర్లను చూసి అసహ్యించుకుంటారే గానీ, స్వార్థం లేని వారి మనస్సును అర్థం చేసుకునేవారు చాలా తక్కువే. జన్యుపరమైన మార్పులను వారి తప్పుగా పరిగణిస్తారు. వెలివేసి మనస్సును శిక్షిస్తారు. అక్రమ్ పరిస్థితి ఇలాంటిదే.
బాల్యంలోనే ఇంటికి దూరమైన అక్రమ్.. మైసూర్‌లోని రాజీవ్‌నగర్ రోడ్డుమీద పడింది. ఎన్నో ఏళ్లు ఒంటరిగా కాలం గడిపింది. షాపుల్లో భిక్షాటన చేసి జీవనం సాగించింది. అప్పుడే.. తన తోడబుట్టిన చెల్లి ఆస్తా బాను కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలుసుకుంది. మగబిడ్డను కనలేదని ఆమె భర్త విడాకులిచ్చాడని తెలిసి ఎంతో బాధపడింది.
తరిమేసిన వారికి అండగా..
కాదని తరిమేసిన కుటుంబం కష్టాల్లో ఉంటే.. నాకెందుకులే అనుకోలేదు అక్రమ్. పరుగున వెళ్లి ఆస్తాకు ధైర్యం చెప్పి, తన ఇద్దరు కుమార్తెలు ఫాతిమా, హాజిరాలను దత్తత తీసుకుంది. సమాజంలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూసింది కాబట్టి.. వారిని కరాటే, బాక్సింగ్ తరగతుల్లో చేర్పించింది.
"నేను ట్రాన్స్‌జెండర్‌గా జన్మించాను. ఇది నా ఎంపిక కాదు. దేవుడు నన్ను ఇలా చేశాడు. ఇప్పుడు దీని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే.. నా మరణానికి ముందు సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను." -అక్రమ్
మేనమామే అమ్మ
అమ్మగా మారిన మేనమామ ప్రోత్సాహంతో ఇప్పుడు 7వ తరగతి చదువుతోన్న ఫాతిమా, 6వ తరగతి అభ్యసిస్తోన్న హాజీరా మంచి బాక్సర్లుగా తయారయ్యారు. ఇటీవల మైసూరు, లఖ్‌నవూలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫాతిమా బంగారు పతకం సాధించగా, హజీరా రెండు రజతాలు సాధించింది.
అక్రమ్ వీరిద్దరినే కాకుండా.. మరొక అమ్మాయినీ దత్తత తీసుకుంది. ఆడపిల్లలను తన ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు వారిని అద్దె ఇంట్లో ఉంచి భద్రంగా కాపాడుకుంటోంది.
ఇదీ చూడండి:దంతాలు శుభ్రం.. గిన్నిస్ రికార్డు సొంతం..