హిందూ ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో సైనికులు, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఓ ఆలయాన్ని నిర్మించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన 50మంది అమరుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నగరంలోని నర్సింగ్ ఘాట్ వద్ద ఉన్న ఈ గుడికి భారత సేవకుల ఆలయంగా నామకరణం చేశారు. విగ్రహాలపై అమరుల వీర గాథలను రాసి ఉంచారు.
భారత మొదటి సైన్యాధిపతి కె.ఎం. కరియప్ప, మొదటి ఫీల్డ్ మార్షల్ జనరల్ సామ్ మనేక్షా, వాయుసేన మాజీ అధిపతి అర్జున్ సింగ్ సహా పలువురి అమరుల ప్రతిమలు ఆలయంలో ఉన్నాయి. వారి శౌర్యం, సంకల్ప శక్తి భారత త్రివిధ దళాల్ని దేశానికి గర్వకారణం చేశాయి.
సైనికుల త్యాగాలకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని విశ్రాంత జడ్జి దాన్ సిగ్ చౌదరి కట్టించారు. పదవీ విరమణ చేశాక వచ్చిన డబ్బుతో దీనిని నిర్మించారు. ప్రస్తుతానికి ఆయన లేకపోయినా అమరవీరుల కోసం కట్టించిన గుడి భావి తరాలకు నిజమైన వీరుల చరిత్రను తెలిజేస్తుందని ఆలయ పూజారి రామ్ సింగ్ చెబుతున్నారు.