తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతును బతికించుకునేందుకు ముందడుగేద్దాం! - రైత ఆత్మహత్యలు

దేశానికే ఓ కన్ను తాను.. కానీ, ప్రకృతి విలయాలకు.. తీరని రుణభారాలను మోయలేక లోకాన్నే వీడుతున్నాడు. అందరి కడుపులు నింపాల్సిన రైతన్న కడుపుకోత ప్రభుత్వాలకు ఎందుకు పట్టవు? ఇంకా ఎన్ని రైతు ఆత్మహత్యలను చూడాలి? రైతు సమస్యలకు పరిష్కారమేమిటి?

రైతును బతికించుకునేందుకు ముందడుగేద్దాం!

By

Published : Nov 11, 2019, 7:40 AM IST

Updated : Nov 11, 2019, 8:48 AM IST


పాతికేళ్లుగా దేశంలో ఎన్నెన్ని ప్రభుత్వాలు మారినా అన్నదాతల కడగండ్ల సేద్యం ఎక్కడికక్కడ కన్నీటి కాష్ఠాల్ని ఎగదోస్తూనే ఉంది. నూట ముప్ఫై కోట్ల మందికి పైగా జనావళికి రోజూ ముప్పూటలా నాలుగు వేళ్లు నోట్లోకి పోవడానికి, మరోమాటలో జాతి ఆహార భద్రతకు పూచీపడుతున్న రైతులు- బతుకుపోరులో డస్సి బలవన్మరణాలకు పాల్పడుతున్న వైపరీత్యం కలచివేస్తోంది!

బలిదానాలెన్నో..

తాజాగా జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన వివరాల మేరకు 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,379 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సగటున ప్రతి రోజూ 31మంది, నెలకు 948మంది వంతున రైతులు తనువు చాలించారంటున్న నివేదిక- 2014 (12,360), 2015 (12,602)తో పోలిస్తే ఆత్మహత్యల ఉరవడి తగ్గిందంటోంది.

వరసగా కొన్నేళ్ల నుంచి రైతుల బలవన్మరణాల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్ర 2016లోనూ 3,661 మంది ఆత్మహత్యలతో అగ్రస్థానంలో నిలువగా, కర్ణాటక (2,078), మధ్యప్రదేశ్‌ (1,321), ఆంధ్రప్రదేశ్‌ (804), ఛత్తీస్‌గఢ్‌ (682), తెలంగాణ (645) తదుపరి అయిదు స్థానాల్లో ఉన్నాయి.

కారణాలు అనేకం

ఆత్మహత్యల్లో సాగుదారుల సంఖ్య 21 శాతం తగ్గిందంటున్న నివేదిక, వ్యవసాయ కూలీల బలవన్మరణాలు పది శాతం మేర పెరిగాయని నిర్ధారిస్తోంది. గత నివేదికల్లో రైతులు విస్పష్టంగా ఎందుకు (పంట నష్టం, గిట్టుబాటు లేమి, రుణాలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం వంటి కారణాలు) ఆత్మహత్యలకు పాల్పడ్డారో ప్రత్యేకంగా ఎన్‌సీఆర్‌బీ ప్రస్తావించేది. రుణాలు తీసుకొన్నట్లయితే అవి ఎక్కడి నుంచి అన్న సమాచారంతోపాటు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్నీ పేర్కొనేది. ఈసారి వాటితోపాటు మరింత సమగ్రత కోసం మరిన్ని క్యాటగిరీలు చేర్చి సమాచారాన్ని కూర్చినా- ఆ వివరాలు వెలుగు చూడనేలేదు.

పశ్చిమ్‌ బంగాల్​ వివరాల్లేకుండానే వెలువడిన తాజా నివేదిక 6,270మంది రైతులు, 5,109మంది వ్యవసాయ కూలీలూ జీవన పోరాటాన్ని అర్ధాంతరంగా ముగించారంటోంది. ప్రభుత్వ ప్రాయోజిత భిన్న పథకాల అమలు ఏ తీరుగా ఉందో కళ్లకు కడుతున్న గణాంకాలివి!

ఇలాగే ఉంటే.. లక్షల్లో

రైతుల ఆత్మహత్యల వివరాల్ని ఎన్‌సీఆర్‌బీ క్రోడీకరించడం మొదలు పెట్టిన 1995 నుంచి 2016 దాకా మూడు లక్షల 30వేల 407మంది రైతులు బలవన్మరణాల బలిపీఠమెక్కిన దేశం మనది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2020 నాటికి దాదాపు నాలుగు లక్షలమంది రైతుల ఆత్మహత్యల్ని దేశం చూడాల్సివస్తుందన్న ఐఈఎస్‌ అధికారి పీసీ బోధ్‌ అంచనా గుండెల్ని పిండేస్తోంది.

రాత్రి పగలు, ఎండా వానా, పురుగూపుట్రా వేటినీ లెక్కచేయకుండా స్వేదం చిందించి సేద్యం చెయ్యడం ద్వారా రాజనాలు పండించే రైతుకు గిట్టుబాటు సంగతి దేవుడెరుగు- జరుగుబాటూ కష్టమై రుణాల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు వదిలే దారుణం ఇంకెన్నేళ్లు కొనసాగాలి?

కూలీల ఆత్మహత్యలు

2013-’18 మధ్య 15,356 మంది రైతుల చావుడప్పులు మోగిన మహారాష్ట్రలో మూడు నెలల క్రితం కరవు అన్నదాతల ప్రాణాల్ని తోడేసింది. ఇప్పుడు అతివృష్టి కారణంగా పంటనష్టం ఉరితాళ్లు పేనుతోంది. మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగానూ రైతులది అదే దయనీయావస్థ!

ఏడాదికి సగటున వెయ్యి దాకా సేద్యసంబంధ ఆత్మహత్యలు నమోదయ్యే పంజాబ్​లో ఈసారి ఆ సంఖ్యను 280గా చూపించడం పట్ల రైతు సంఘాలే ఆక్రోశం వెలిగక్కుతున్నాయి. 17 రాష్ట్రాల్లో సాగుదారుల కంటే వ్యవసాయ కూలీల ఆత్మహత్యలే అధికంగా ఉండటం- గ్రామీణార్థికం ఎంతగా చితికిపోతున్నదో వెల్లడిస్తోంది.

అంతకుమించి, రోజు కూలీల బతుకుబండి సజావుగా నడిచేలా చూడటానికంటూ తెచ్చిన ఉపాధి హామీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో వాళ్ల జీవన యానానికి ఏమేరకు దోహదపడుతున్నదో కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంది. 2022నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు అన్న వాగ్దానాల హోరులోనే ఆగక మోగుతున్న బడుగు రైతుల మరణమృదంగం సర్వసమగ్ర ప్రణాళికల అవసరాన్ని ఎలుగెత్తి చాటుతోంది!

ప్రభుత్వ పథకాలు కాపాడుతున్నాయా?

పన్నెండు కోట్లమంది రైతులకు లబ్ధి చేకూరుతుందంటూ రెండు హెక్టార్ల లోపు సాగుభూమి గల అన్నదాతలకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం అందించే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. వ్యవసాయ రంగ రూపాంతరీకరణపై ముఖ్యమంత్రుల కమిటీ వేసి- వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగులో మార్పులు, కాంట్రాక్ట్‌ సేద్య విధివిధానాలు, ప్రైవేటు పెట్టుబడుల్ని రాబట్టే మార్గాల్ని మదింపు వేసి ఆయా సంస్కరణల్ని రాష్ట్రాలు అమలుచేసే కార్యాచరణ ప్రణాళిక బాధ్యతను దానికి కట్టబెట్టింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌ ఉన్నప్పుడు నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఆ కార్యదళం భవిష్యత్తు ఏమిటన్నది అగమ్యగోచరం! భారతీయ రైతుల్ని ఆదుకొనే కార్యాచరణపై చర్చించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా కొలువుతీర్చాలన్న పలు రైతు సంఘాల మొత్తుకోళ్లకు మన్నన దక్కకపోవడం గమనార్హం!

సేద్యానికి సైన్స్​ జోడిస్తే...

2015లో రుణపాశాలకు చిక్కి ప్రాణాలు తీసుకొన్న రైతుల్లో 80శాతం బ్యాంకులు, సూక్ష్మరుణ సంస్థల నుంచి అప్పు తీసుకొన్నవారేనని గణాంకాలు చాటుతున్నాయి.

రైతుల పరపతి సమస్యల పరిష్కారం ఎప్పుడూ గురికి బారెడు దూరంగానే ఉంటోంది. ఈ సంస్థాగత సవాళ్లకు జతపడి వాతావరణ మార్పుల ప్రభావం సన్న చిన్నకారు రైతుల్ని నలుచుకు తింటోంది. రాష్ట్రానికో, ప్రాంతానికో కాకుండా ప్రతి జిల్లాకూ ఆయా వాతావరణానికి తగిన సేద్య ప్రణాళిక అవసరాన్ని ముంబై ఐఐటీ పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు.

కేరళలో వరదల్ని తట్టుకొన్న పొక్కాలి రకం వరికి తక్కినచోట్లా ప్రాధాన్యం దక్కాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సేద్యాన్ని సైన్స్‌తో అనుసంధానించి, జాతి ఆహార భద్రతకు రైతు జీవన భద్రతే కీలకమని గుర్తించి ముందడుగేయాల్సిన సమయమిది!

ఇదీ చదవండి:అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ

Last Updated : Nov 11, 2019, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details