చెన్నైలోని ట్రిప్లికేన్ వాసులకు తీపి కబురు వినిపించారు ఓ దుకాణం యజమాని. గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న చెన్నైలో ఆయన చేసిన ప్రకటన తెలిసిన వారికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లకు అవసరమైన పిండితో పాటు బకెట్ నీటిని ఉచితంగా అందిస్తున్నారు.
సీకేఆర్ గుప్తా చెన్నైలోని ట్రిప్లికేన్‌లో 50 ఏళ్లుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నెలకొన్న నీటి ఎద్దడి పరిస్థితుల్లో లారీ ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. తమకూ నీటిని అందించాలని తన వద్ద పని చేసే వాళ్లు, చుట్టు పక్కల ప్రజల నుంచి వచ్చిన వినతులతో ఒక కిలో పిండి కొనుగోలు చేస్తే బకెట్ నీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించి, అమలు చేయడం ప్రారంభించారు. అంతే కాదండోయ్... నీటిని కాచి వడబోసిన అనంతరమే వాడండి అనే బ్యానర్‌నూ దుకాణం ముందు ప్రదర్శిస్తున్నారు.
"గత 30 ఏళ్లుగా నేను దుకాణాన్ని నడుపుతున్నాను. ముందుగా మేం పిండిగిర్ని నడిపేవాళ్లం. తర్వాత కాలంలో పిండి తయారు చేసి అమ్మడం ప్రారంభించాం. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కరవు చూడలేదు. నీటి ఎద్దడి కారణంగా పనివాళ్లు సమయానికి రావడం లేదని దుకాణంలో పనిచేసేవారు చెప్పారు. నేను లారీ ద్వారా నీటిని తెప్పించుకుంటున్న కారణంగా.. వారికి అవసరమైన నీటిని ఇవ్వాలని కోరారు. వారికి నీళ్లు ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్లూ నీటి కోసం అడగడం ప్రారంభించారు. ఈ డిమాండ్‌పై నేను ప్రజలకు నీటినందిస్తున్నాను."