అక్కడ మరమ్మతులు చేస్తారు.. అలా అని.. అదేం మెకానిక్ షాపు కాదు. దెబ్బతిన్న, పాడైన వాటిని తిరిగి తీర్చిదిద్దుతారు. కానీ ఎలక్ట్రానిక్ రిపేర్ స్టోరూ కాదు. ఇక్కడన్నీ పెన్నులున్నాయని ఇదేదో బుక్‌స్టాల్ అనుకోకండి. ఇదో ఆసుపత్రి.
శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి సమీపంలో ఉంది ఈ వినూత్న ఆసుపత్రి. పొట్నూరి రాజారావు, ఆనందరావు సోదరులు.. 1975లో ఈ పెన్ ఆసుపత్రి తెరిచారు.
"మెయిన్‌రోడ్‌లో పుట్‌పాత్‌పై మాదొక చిన్నషాప్ ఉండేది. నేను అప్పుడు చిన్న స్టాండ్ వేసి నడిపేవాడిని. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ పెన్ ఆస్పత్రి అని ఓ బోర్డ్ పెట్టి అలా దానిని అభివృద్ధి చేస్తూ వచ్చాం. జాతకాలు రాసిన వాళ్లు ఇంక్‌పెన్‌తోనే రాయాలి. డాక్యుమెంట్ రాసినవాళ్లూ ఆ పద్ధతిలోనే చేస్తారు. మాములుగా కూడా జనం ఉండేవారు. అప్పుడు అంతా ఇంక్ పెన్నే కదా."
- రాజారావు, శ్రీకాకుళం
"పెన్ రిపేర్ కోసం 1975లో అన్నదమ్ములు ఇద్దరం కలసి ఈ షాపు ప్రారంభించాం. పెన్ ఆస్పత్రికి శ్రీకాకుళంలోనే కాదు మొత్తం ఆంధ్రా అంతా మంచి పేరు ఉంది. విదేశాల నుంచి కూడా కొన్ని పెన్‌లు రిపేర్‌కు వస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏ డాక్టర్ అవనీ, లాయర్ అవనీ, మా దగ్గర పెన్ కొని చదివిన వారే. ఈ పేరు అనేది స్టాండర్డ్‌గా ఉంది."
- ఆనందరావు, శ్రీకాకుళం
ఇంకు, జెల్, బాల్ పాయింట్ పెన్నులకు ఇక్కడ మరమ్మతులు చేస్తారు. దీని కోసం ఆకురాయి, సానబెట్టే రాయి, నీళ్లు, బ్లేడు, ఇంకు ఉపయోగిస్తారు. రకరకాల పెన్నులూ విక్రయిస్తారు. విదేశాల నుంచి ఖరీదైన కలాలు తీసుకొస్తారు. పెన్ సర్వీస్ పూర్తిగా ఉచితం.
"అంటే పెన్ హాస్పిటల్ అనే సంస్థకు ఒక గుడ్‌విల్ రావాలని, పెన్ అంటే ఏంటో ఈ ఊరి నుంచి విలువ తెలియాలనేదే మా తపన. ఇంక్ పెన్ వాడాలంటే మాత్రం రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే కడగాలి. ఇప్పుడు కస్టమర్లలో ఓపిక, సహనం ఎవరికి లేదు కాబట్టి అది మన షాప్‌కు వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఏ పెన్‌కు రిపేర్ చేసినా రూపాయి తీసుకోం. విడిభాగావు, పాళీ గానీ, టంగ్ గానీ వేస్తే అందుకు మాత్రమే డబ్బులు తీసుకుంటాం."
- నాగరాజు, శ్రీకాకుళం