సాధారణంగా హిమాలయాల్లో పెరిగే కుంకుమచెట్టు.. రాజస్థాన్లో అరుదుగా కనిపిస్తుంది. అజ్మేర్ వాసి అశోక్ జటోలియా ఇంట్లో అలాంటి ఓ చెట్టు ఉంది. అది స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. చెట్టు నుంచి సహజమైన కుంకుమ తీసుకోవడం కోసం స్థానికులు ఎంతోమంది వస్తున్నారు.
కుందన్ నగర్లో 'కలీమా'
కుంకుమ సహజంగా చెట్ల నుంచి వస్తుందని చాలా తక్కువమందికి తెలుసు. ఇంగ్లీషులో కుంకుమ చెట్టును కలీమా అంటారు. పర్వత ప్రాంతాల్లోనే పెరిగే ఈ చెట్టు.. ఇప్పుడు కుందన్ నగర్లో సందడి చేస్తోంది. స్థానికులు దానిని పవిత్రంగా పూజిస్తూ ఈ చెట్టు పండ్లు తమతో తీసుకెళ్తారు.
"సింధూరచెట్టును ఏడేళ్ల క్రితం భోపాల్ నుంచి తెచ్చాను. మొదట 2, 3 ఏళ్లు కుండీలో ఉంచాను. తర్వాత భూమిలో నాటాను. దీన్నందరూ పవిత్రంగా భావించి కుంకుమ తీసుకెళ్లి, వాడుకుంటారు."
- అశోక్ జటోలియా, చెట్టు యజమాని
అజ్మేర్లోని అన్ని ఆలయాలకూ..
అశోక్ జటోలియాకు మొక్కల పెంపకమంటే ఆసక్తి. అప్పట్లో ఎంతోమందిని అడిగాక గానీ అది కుంకుమ చెట్టని తెలియలేదు. తెలిశాక దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాలాజీ, గణేషుడి పూజ కోసం చెట్టు నుంచి పండ్లు తీసుకెళ్తారు. అశోక్ భార్య సునీత.. అజ్మేర్లోని దాదాపు అన్ని ఆలయాలు తమ చెట్టు నుంచి కుంకుమ తీసుకెళ్లాయని చెబుతున్నారు. మార్కెట్లో దొరికే కుంకుమ.. ఎరుపురంగులో, రసాయనాలతో కూడి ఉంటుందనీ, సింధూర వర్ణంలో ఉండే చెట్టు కుంకుమ వల్ల ఎలాంటి హానీ ఉండదనీ అంటున్నారు.