నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను దివ్యాంగులు ఇతరులతో చెప్పుకోలేరు. ఇంకొకరి ఆసరా కూడా వారికి పెద్ద భారమే. అలా బాధపడేవారికి ఒడిశాలోని ఓ రెస్టారెంటు ఆదర్శంగా నిలుస్తోంది. కారణం... అందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యంతో బాధపడుతున్నవారే.
గొప్ప సంకల్పం....
ఒడిశాలోని ఈ దివ్యాంగుల బృందం.. సమాజానికి ఏదో చెప్పాలనుకుంది. వారిని విస్మరించరాదని, చిన్నచూపు చూడకూడదని చెబుతూ.. బాధ్యతాయుతంగా నిలిచింది. అందుకే భువనేశ్వర్‌లో పూర్తిగా వీరి ఆధ్వర్యంలోనే 'తృప్తి కెఫే' అనే హోటల్ నడుస్తోంది. క్రమక్రమంగా ఎదుగుతోన్న ఈ నగరంలో మనుషులకు బదులు రోబోలూ హోటళ్లలో సేవలందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. పెద్ద పెద్ద షెఫ్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిన్నపాటి రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారంటే వారి సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.