ఎటు చూసినా కవలలు.. అయోమయంలో టీచర్లు! ఒకే చోట, ఒకే పేరున్న వారు ఇద్దరు ముగ్గురుంటేనే వారిని పిలిచే సమయంలో కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇక ఒకే చోట, ఒకే రూపురేఖలున్నవారు జంటలు జంటలుగా ఉంటే? వారిని గుర్తించాలంటే తలప్రాణం తోకకొస్తుంది. తమిళనాడు సిర్కాలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అలాంటి పరిస్థితే నెలకొంది. ఈ బడిలో మొత్తం 54 కవలలున్నారు.
అక్కడ కవలలే ఎక్కువ...
ఏటా ఎలా లేదన్నా 20 కొత్త కవలలు ఈ బడిలో చేరతారు. ఇందుకు కారణం సిర్కాజి పట్టణంలో దశాబ్దాలుగా కవలల జననాల సంఖ్య ఎక్కువ ఉండడమే.. అయితే, ఈ ప్రాంతంలో ఇలా కవల కాన్పులు ఎక్కువగా ఎందుకవుతాయనేది ఇప్పటికీ ఓ రహస్యమే.
కనిపెట్టలేం.. విడదీయలేం
అయితే, బడి నిండా కవలలే ఉండే సరికి.. ఉపాధ్యాయులకు వారిలో ఎవరెవరో కనిపెట్టడం ఓ పెద్ద సవాలుగా మారింది. పోనీ, వారిని వేరు వేరుగా కూర్చోబెడదామంటే తమ పిల్లలు ఒకే దగ్గర ఉండాలని మొండికేస్తారు తల్లిదండ్రులు. ఒకే తల్లి బిడ్డలు ఒక తరగతి గదిలో ఉంటేనే ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారని వారి నమ్మకం.
కవలలు ఇలా కలిసి చదవడం వల్ల వారి మధ్య ప్రేమా ఆప్యాయతలూ పెరుగుతున్నాయి. ఒకరికి ఒంట్లో బాగోలేక బడికి రాలేకపోయినా, మరొకరు ఇంటికొచ్చాక వారికి పాఠాలు వివరించి మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు కవల విద్యార్థులు.
12వ తరగతి చదువుతున్న ఈ కవలలు కే ఎమ్ ప్రిత్యాంకా, కే ఎమ్ ప్రియాంకలు పేర్లు మార్చి చెప్పి టీచర్లను, మిగతా విద్యార్థులనూ ఆటపట్టిస్తూ ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి ఈ నగరంలో అత్యధిక కవలలున్న బడిగా ప్రసిద్ధికెక్కిందీ పాఠశాల.
ఇదీ చదవండి:ఆకులపై చెక్కినా.. చెక్కుచెదరని చిత్ర కళ