తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 3:17 PM IST

ETV Bharat / bharat

'పీహెచ్​డీ చేసి.. పొట్టకూటికి పండ్లు అమ్ముతున్నా'

మధ్యప్రదేశ్​లో డాక్టరేట్ సాధించిన ఓ యువతి.. తోపుడు బండిపై పండ్లు అమ్ముతోంది. మార్కెట్​లో కరోనా నియమాల పేరిట చిరు వ్యాపారుల పొట్టకొడుతున్న అధికారులకు ఎదురు తిరిగి గెలిచింది. మరో వైపు క్యాన్సర్, కొవిడ్-19 వంటి మహమ్మారులను అంతం చేసే వ్యాక్సిన్​పై పరిశోధనలు చేస్తోంది.

a PHD holder raisa anasari selling fruits in the indore, patnipura mandi
'పీహెచ్ డీ చేసి.. పొట్టకూటికి పండ్లు అమ్ముతున్నా'

'డిగ్రీ చేశాం.. ఆ స్థాయిలోనే ఉద్యోగం చేస్తాం.. లేకుంటే నిరుద్యోగులుగానే ఉండిపోతాం' అనుకునేవారున్న ఈ రోజుల్లో.. పీహెచ్​డీ చేసి పండ్లు విక్రయిస్తోంది మధ్యప్రదేశ్​కు చెందిన రైసా అన్సారి. మార్కెట్​లో తోటి చిరువ్యాపారులకు అండగా నిలుస్తోంది.

శాస్త్రవేత్త కావాలనుకుని....

ఇందోర్, పాట్నిపురా బజార్లో తోపుడు బండిపై పండ్లు విక్రయించే రైసా.. శాస్త్రవేత్త కావాలనుకుంది. అందుకే భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్​లో పీహెచ్​డీ పూర్తి చేసింది. లాక్​డౌన్​ ముందు వరకు ఓ కళాశాలలో ప్రొఫెసర్​గానూ పని చేసింది. కానీ, అనివార్య కారణాల వల్ల రైసా ఉద్యోగం కోల్పోయింది.

దీంతో, తండ్రి నడిపిన ఆ తోపుడు బండే తనకు జీవనాధారమైంది. మామిడి పండ్లు అమ్ముతూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటికి వెళ్లాక క్యాన్సర్, కరోనాలను అంతం చేసే వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తోంది.

ఎదురుతిరిగి గెలిచింది..

అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాపార కార్యకలాపాలపై కొన్ని నియమాలు అమలు చేస్తోంది ఇందోర్ పురపాలక సంస్థ. రోజు విడిచి రోజు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. మున్సిపల్ ఆదేశాలు అతిక్రమించి.. రోజూ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం మొదలెట్టింది.

ఈ క్రమంలోనే రైసా పండ్ల బండిని మార్కెట్ నుంచి తొలగించాలన్నారు అధికారులు. దీంతో రైసా అధికారులపై మండిపడింది. దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుంటే.. చిరు వ్యాపారులను ఇలా వెళ్లగొట్టడమేంటని ప్రశ్నించింది.

'పీహెచ్ డీ చేసి.. పొట్టకూటికి పండ్లు అమ్ముతున్నా'

పేద ప్రజల దీన స్థితిని అర్థం చేసుకోకుండా, ఆచరణయోగ్యం కాని నియమాలు ఎలా పెడతారని అధికారులను నిలదీసింది రైసా. తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే యువతి ఆంగ్లంలో అనర్గళంగా ప్రశ్నిస్తుంటే.. అధికారులు విస్తుపోయారు. రైసా మాటల్లో వాస్తవాన్ని గ్రహించి అక్కడి నుంచి వెనుదిరిగారు.

పండ్లు విక్రయిస్తున్నా డాక్టరేట్ స్థాయిలోనే ఆలోచన చేసి.. అధికారుల మనసు మార్చిన డాక్టర్ రైసా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:'సారీ.. డబ్బుతో పాటు మీ ప్యాంటూ దొంగిలించా!'

ABOUT THE AUTHOR

...view details