వయో వృద్ధులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధుల పోషణ, సంక్షేమాన్ని పట్టించుకోకపోతే వారసులే కాకుండా అల్లుడు, కోడలిపైనా ఇకపై నేరం మోపనున్నారు. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం సవరణ బిల్లు- 2019లో ఈ నిబంధనలు పొందుపరిచారు. బుధవారం కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
జాగ్రత్త : వయో వృద్ధులను పట్టించుకోకపోతే ఇకపై నేరం!
కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులకు భరోసాను కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వయో వృద్ధులను, వారి నెలవారీ పోషణను పట్టించుకోకపోతే వారసులే కాదు వారి అల్లుడు, కోడలిపై కూడా ఇకపై నేరం మోపనున్నారు.
పోషణ నిమిత్తం కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన మొత్తం గతంలో గరిష్ఠంగా 10వేల రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తివేశారు. దీని ప్రకారం ఎక్కువగా సంపాదించేవారు వారి తల్లిదండ్రుల పోషణకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కనిష్ఠంగా 5 వేల రూపాయలు లేదా మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించవచ్చు.
తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమకు నెలవారీ ఖర్చులు చెల్లించడం లేదని 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు చేసే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వృద్ధాశ్రమాలు, హోం కేర్ సర్వీసు ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా, కనీస ప్రమాణాలు పాటించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. ప్రతి ఠాణాలో వృద్ధుల కోసం నోడల్ పోలీసు అధికారిని నియమించడం లేదా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పోలీసు యూనిట్‌ను నెలకొల్పి వారి వినతులు స్వీకరించాలని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. వయోవృద్ధుల సమస్యలను వినడానికి ప్రతి రాష్ట్రం ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.