యక్షగానంలో అదరగొడుతున్న ముస్లిం మహిళ అర్షియా యక్షగానం... కరవళిలోని ఓ సంప్రదాయ కళ. ఇది కేవలం పురుషులకే పరిమితం కాలేదు. ఈ కళారంగంలోకి మహిళలూ ప్రవేశించి సత్తా చాటుతున్నారు. అంతేకాదు...ఈ కళ ఏ ఒక్క మతానికి మాత్రమే కాదని నిరూపిస్తోంది అర్షియా. పాత్రల్లో లీనమై, అత్యద్భుతంగా యక్షగానం ప్రదర్శించడంలో తనకు తానే సాటి అని చాటిచెప్తోంది. సంభాషణలు చెప్పే తీరు, హావభావాలు, ముఖకవళికలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
అర్షియా కల సాకారమైందిలా..
అర్షియా ముస్లిం మహిళ అయినప్పటికీ.. ఇతర కళాకారులందరికీ ప్రతిభతో గట్టి పోటీనిస్తోంది. మహిషాసురుడిగా వేషం కట్టి, యక్షగానం ప్రదర్శిస్తున్న అర్షియాను ఇక్కడ చూడొచ్చు. యక్షగానం చేసే మొట్టమొదటి మహిళగానూ ఆమె రికార్డు కైవసం చేసుకుంది. చిన్నతనంలో దేవీ మహాత్మాను చూసినప్పుడు ఈ కళపై ఆరాధన పెరిగింది అర్షియాకు. ఆ ప్రదర్శనలోనూ మహిషాసురుడి పాత్ర బాగా ఆకట్టుకుంది. అదే పాత్రను తాను పోషించేలా స్ఫూర్తిగా నిలిచింది. మొత్తానికి కలను సాకారం చేసుకుంది అర్షియా.
"యక్షగానం భారతీయ సంస్కృతి. సినిమా, నాట్యం, ఇతర కళల్లో ముస్లిం మహిళలు ఉన్నట్లే, నేను యక్షగానంలో భాగస్వామిగా ఉన్నాను. మహిషాసురుడి పాత్ర పోషిస్తాను. గౌరవనీయమైన కళల్లో యక్షగానం ఒకటి. యక్షగానంలో మహిషాసురుడు, నిశుంబాసురుడి పాత్రలు చూశాక, మహిషాసురుడి బట్టలు, గజ్జెలు కట్టుకోవాలని కలలు గన్నాను."
- అర్షియా, యక్షగానం కళాకారిణి
టీవీల్లో చూస్తూ..
బాల్యంలో యక్షగానంలో పాలుపంచుకోవాలని కలలు కనేది అర్షియా. కానీ దక్షిణ కన్నడలోని ఒక్కెతుర్ మడా అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అర్షియాకు ఆ సమయంలో కల నెరవేర్చుకునే అవకాశం కుదరలేదు. దూరదర్శన్‌లో యక్షగానం చూస్తూ, ఆ నృత్యం నేర్చు కోవడం ప్రారంభించింది. ఆమె ఆసక్తి గమనించిన యక్షగానం గురువు జయరాం... అర్షియాను ప్రోత్సహించారు. డిగ్రీ పూర్తి చేసి, వివాహబంధంలోకి అడుగుపెట్టినా... యక్షగానంపై ఆమెకున్న మక్కువ పోలేదు. థియేటర్లలో ప్రదర్శనలు చూసేది. సామాజిక మాధ్యమాల్లో వాటిగురించి వెతికేది. కడలి కళాకేంద్రంలో చేరి, రమేష్ భట్ వద్ద శిక్షణ తీసుకుంది.
"తను ముస్లిం అని మొదట్లో తెలియదు. యక్షగాన తరగతుల్లో చేరినట్లు చెప్పింది. తర్వాతే ఆమె ముస్లిం అని తెలిసింది. ముస్లిం మహిళ అయినప్పటికీ యక్షగానం నేర్చుకుని, ప్రదర్శనలిస్తోందంటే మాకు చాలా గర్వంగా ఉంది. తన ప్రదర్శనలు చూసిన తర్వాత...నేనూ యక్షగానం నేర్చుకోవడం మొదలుపెట్టాను."
- ప్రకృతి, అర్షియా స్నేహితురాలు
ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తూనే..
ప్రస్తుతం అర్షియా ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తోంది. అభిరుచి, వృత్తినీ సమన్వయం చేసుకుంటూ రాణిస్తోంది. ఈ ప్రయాణంలో కుటుంబసభ్యులు, స్నేహితులు అర్షియాకు అండగా నిలిచారు. సాధారణంగా బహిరంగ ప్రదర్శనల్లో ముస్లిం మహిళలు తక్కువగా కనిపిస్తారు. కానీ.. యక్షగానంలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది అర్షియా. తల్లిదండ్రులు ఆమెను ముద్దుగా 'తను' అని పిలుస్తారు. వారి ప్రోత్సాహంతోనే ఆమె తన కల నెరవేర్చుకోగలిగింది.
ఇదీ చదవండి:ప్లాస్టిక్‌లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'