చేతిలో డబ్బు లేదు. పోనీ లాక్‌డౌన్ అయ్యే వరకు ఇక్కడే ఉందామంటే పూట గడవడం కష్టం. అలాగని నడిచి వెళ్దామంటే నడవలేని స్థితిలో కొడుకు. ఇలాంటి కష్ట సమయంలో ఆ వలస కూలీకి మరో దారి లేకపోలేకపోయింది. అంతరాత్మ అంగీకరించనప్పటికీ దొంగతనం చేయడం తప్పనిసరైంది. దీంతో ఓ ఇంటి బయట ఉంచిన సైకిల్‌ను ఎత్తుకెళ్లాడు. తనను క్షమించాలంటూ ఓ లేఖ రాసిపెట్టాడు. వలస కూలీ దుస్థితికి అద్దంపట్టే ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
యూపీలోని బరేలీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాన్ రాజస్థాన్లోని భరత్‌పూర్‌లో నివాసముంటున్నాడు. అతడితో పాటు దివ్యాంగుడు అయిన కుమారుడు కూడా ఉన్నాడు. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన అతడు ఇంటికెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. నడవలేని స్థితిలో ఉన్న కుమారుడితో ఇంటికెళ్లేందుకు చివరికి భరత్‌పూర్‌లోని ఓ గ్రామంలో ఇంటి ముందున్న సైకిల్‌ను అపహరించాడు. మనసు అంగీకరించకపోవడంతో ఓ లేఖ రాసిపెట్టాడు.