సంక్రాంతి పర్వదినాన.. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నిజానికి పతంగులు ఎగరవేయడం కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తూ ఉంటారు. అదే తరహాలో వాటిపై అమితాసక్తిని పెంచుకున్నాడో వ్యక్తి. ఎంతలా అంటే... గాల్లో ఎగిరితే ఎక్కడ దారం తెగి దూరమైపోతాయోనని.. గాలిపటాల ఆకారాల్లో బంగారు ఆభరణాలను చేయించుకున్నాడు ఈ మధ్యప్రదేశ్ వాసి. ఒకటి కాదు, రెండు కాదు... రకరకాల పసిడి పతంగుల గొలుసులను తన మెడలో వేలాడేసుకుని గాలిపటాలపై తనకున్న అభిరుచిని చాటుకుంటున్నాడు లక్ష్మీనారాయణ ఖండేల్వాల్.
'పతంగి' ఆభరణాలతో..
భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతానికి చెందిన ఖండేల్వాల్కు గాలిపటాలతో ప్రత్యేక అనుబంధముందట. పతంగులపై అతడికున్న అభిమానాన్ని చూసి.. స్థానికులు 'కైట్ మ్యాన్' అని కూడా పిలుస్తారట. ఓ చిన్న దుకాణంలో హోల్‌సేల్‌గా పతంగుల వ్యాపారం చేసే అతడికి.. తన 50ఏళ్లలో వాటిపై అభిరుచి పెరిగింది. వాటిపై ప్రేమతో.. అవి ఎల్లప్పడూ తన చెంతే ఉండాలని భావించాడు. ఇందుకోసం ఏకంగా పసిడి ఆభరణాలతో.. మెడలో గొలుసు, చేతికి ఉంగరాలు, చెవిలీలు పతంగి ఆకారంలో చేయించుకున్నాడు. అందరూ సంక్రాంతి రోజు మాత్రమే గాలిపటాలను గుర్తుచేసుకుంటే.. లక్ష్మీనారాయణ మాత్రం రోజూ వాటితో మురిసిపోతున్నాడు.