తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి ఆవేశంతో తన తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు. అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న తన భార్య మెడలోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉండగా.. గర్భవతి అయిన ఆయన భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
భార్యతో గొడవ..
ఫైరదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల నుంచి గురుగ్రామ్‌లోని రామ్‌పురాలో అద్దెకు ఉంటున్నాడు. ఇప్పటికే అతనికి రెండు పెళ్లిల్లయ్యాయి. 2017లో మొదటి భార్యకు దూరమైన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక నిత్యావసర వస్తువుల దుకాణంలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయడం ఏర్పడింది. అది కాస్త వివాహానికి దారి తీసింది. అయితే, గత కొంతకాలంగా పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీనితో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం రెండో భార్య ఐదు నెలల గర్భవతి కావడం వల్ల గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం కారులో తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఉద్యోగ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనితో సదరు వ్యక్తి ఆవేశంతో కారులో ఉన్న తుపాకీ తీసుకొని తన చెవిలో కాల్చుకున్నాడు. అయితే అతని తలలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారమందించారు.