అప్పు కోసం బ్యాంక్లో తుపాకీతో వీరంగం బ్యాంకురుణం మంజూరుకాలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి... మధ్యవర్తి సహా బ్యాంకు అధికారులపై దాడిచేసిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో జరిగింది.
వెట్రివేలన్ కోయంబత్తూరు కెనరాబ్యాంకు నుంచి రూ.3 లక్షల రుణం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు మధ్యవర్తిగా గుణబాలన్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఎంతకాలమైనా రుణం మంజూరుకానందున వెట్రివేలన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. రహస్యంగా ఓ తుపాకీ తీసుకొని బ్యాంకులోకి ప్రవేశించాడు.
బ్యాంకు అధికారులపైనా..
బ్యాంక్ మేనేజర్ గదిలోనే మధ్యవర్తి గుణబాలన్కు తుపాకీ గురిపెట్టి దాడిచేశాడు వెట్రివేలన్. కొద్ది క్షణాలకు తేరుకున్న బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ వారిని ఆపి, తుపాకీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెట్రివేలన్ ఆయనపైనా దాడిచేశాడు. ఆపేందుకు యత్నించిన సిబ్బందిపైనా విరుచుకుపడ్డాడు. కాసేపటికి వెట్రివేలన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెట్రివేలన్ తెచ్చింది బొమ్మ తుపాకీ అని అనుమానం.
ఇదీ చూడండి: మంచు కొండలు విరిగిపడి ఐదుగురు జవాన్లు మృతి