కుబేరుడైన ఉల్లి రైతు- సీజన్ ఆదాయం రూ.2.4 కోట్లు ఓ వైపు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతుంటే... మరో వైపు కర్ణాటక చిత్రదుర్గకు చెందిన మల్లికార్జున మాత్రం ఉల్లి ధరలు పెరగడం వల్లే కోట్లకు అధిపతి అయ్యాడు. తన పొలంలో ఉల్లి సాగు చేసి 240 టన్నుల దిగుబడి పొందాడు. ఏకంగా 2 కోట్ల 40 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించాడు.
కష్టానికి.. అదృష్టం తోడైతే?
మల్లికార్జునకు సొంతంగా ఉన్న 10 ఎకరాల భూమితో పాటు.. మరో పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 2004 నుంచి ఏటా వర్షాకాల ఆరంభంలోనే ఆ 20 ఎకరాల భూమిలో ఉల్లి సాగు చేస్తున్నాడు. ఈ సారి ఎప్పటిలాగే ఉల్లి పంట వేశాడు. రూ. 20 లక్షల రూపాయల అప్పు చేసి మరీ రూ.15 లక్షలు కేవలం ఉల్లిపైనే పెట్టుబడి పెట్టాడు.
గతేడాది రూ.5 లక్షల లాభం వచ్చింది కనుక ఈ సారీ.. అప్పులన్నీ తీరిపోయి, 5 నుంచి 10 లక్షల రూపాయలు లాభం వస్తుందని ఊహించాడు. 50 మంది కూలీలను పెట్టి ఉల్లి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అదృష్టం బాగుండి... 240 టన్నులు దిగుబడి వచ్చింది.
మార్కెట్లో ఉన్న రేటు కన్నా కాస్త తక్కువగానే విక్రయించాలని అనుకున్న రైతు, ఒక్క కిలోకు రూ.100 ధర ఖరారు చేశాడు. ఇంకేముందీ.. మల్లికార్జున కలలో కూడా ఊహించని విధంగా అతని ఆదాయం 2 కోట్ల 40 లక్షల రూపాయలు దాటిపోయింది. ఇలా, ఒకరిని ఏడిపిస్తూ.. మరొకరి ముఖంలో చిరునవ్వులు తెప్పిస్తూ చమత్కారాలు చేస్తోందీ ఉల్లి మహాతల్లి.
ఇదీ చదవండి:'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'