బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును.. సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దర్యాప్తుల్లో కీలకంగా మారిన ఈ సంస్థకు గతంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. ప్రజలే ఈ సంస్థ విలువలు, ఫలితాలను ప్రశ్నించారు. అయితే ఎన్ని ఆటంకాలు, విమర్శలు వచ్చినా ఇప్పటికీ కచ్చితమైన దర్యాప్తు, కేసుల్లో నిజాలను నిగ్గుతేల్చేందుకు.. సీబీఐ విచారణ అవసరం అనేది ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఉన్న నమ్మకం.
"సీబీఐ ఎన్నో ఉత్థానపతనాలు ఎదుర్కొంది. నేను దాదాపు 10ఏళ్లు ఈ సంస్థకు సేవలందించాను. నా కెరీర్లో సెయింట్ కిట్స్ ఫోర్జరీస్ కేసు సహా ఎన్నో అవినీతి కేసులను డీల్ చేశాను. సంస్థపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఒక్కోసారి మంచి చేయడంలో విఫలమైనా.. మంచి చేసిన వాటికి మాత్రం సీబీఐ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఏ కేసును దర్యాప్తు చేయాలన్నా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి వస్తోంది. గతంలో అలా ఉండేది కాదు. ఇది సంస్థ స్వయం ప్రతిపత్తికి ఆటంకంగా మారింది. అయినప్పటికీ ప్రజలకు సీబీఐపై నమ్మకం మాత్రం అలానే ఉంది".
-- ఎన్కే సింగ్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్.
"సీబీఐ పనిలో రాజకీయ జోక్యం సరైనది కాదు. సంస్థ పర్యవేక్షణ, ఆర్థిక సహాయం అందించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. ఇటీవలే చేసిన మార్పులు దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ స్వతంత్ర పనితీరుకు అనుకూలంగా లేవు" అని సింగ్ అన్నారు. ఈ మాజీ అధికారి 1977, అక్టోబర్ 2లో ఓ కేసులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
సీబీఐ అనేది అవినీతి నుంచి హత్య కేసుల వరకు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన ఏజెన్సీ. భారత్‌లో బాగా చర్చనీయాంశమైన కేసు గానీ, ఏదైనా ప్రముఖ కుంభకోణాల అంతుతేల్చే పని సీబీఐకి అప్పగిస్తుంటారు. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంచలన అత్యాచార కేసులు, బ్యాంక్ మోసాలు ఉన్నాయి. ఎంతో పేరున్న ఈ సంస్థ చేపట్టిన కేసులు ఎక్కువగా పరిష్కారం కాకుండానే ఉండటం మైనస్ పాయింట్. సీబీఐ విజయాలు, వైఫల్యాలు ఇలా...
సీబీఐ స్వీకరించిన పలు సంచలన కేసులు..
స్టెర్లింగ్ బయోటెక్ స్కామ్:
గుజరాత్‌లోని వడోదరకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. సంస్థ ప్రమోటర్లు నితిన్ సందేశరా, చేతన్ సందేశరా, దీప్తి సందేశరా కలిసి వివిధ బ్యాంకుల్లో రూ.5,700 కోట్ల రుణ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సీబీఐ సేకరించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది. అయితే ఆయా డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేసినట్లు పేర్కొంటూ.. లావాదేవీలు జరిపిన వివరాలతో డైరీలను 2011 జనవరిలో స్వాధీనం చేసుకుంది సీబీఐ.
విజయ్ మాల్యా కేసు:
లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసును దర్యాప్తు చేసింది సీబీఐ. 2016లో భారత్ నుంచి యూకేకు పారిపోయారు మాల్యా. ఆయన రూ. 9వేల కోట్ల రుణాన్ని బ్యాంక్‌లకు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అద్భుతమైన పురోగతి సాధించినా.. మాల్యా స్వదేశానికి తెచ్చేందుకు ఇంకా కృషి చేస్తూనే ఉంది.
అగస్టా వెస్ట్‌లాండ్ స్కామ్: