తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోటళ్లకు మళ్లిన 'మహా' రాజకీయాలు.. ఠాక్రేదే తుది నిర్ణయం..!

మా వద్ద బలం ఉంది: శివసేన

By

Published : Nov 7, 2019, 11:58 AM IST

Updated : Nov 7, 2019, 4:32 PM IST

16:02 November 07

మా వద్ద బలం ఉంది: శివసేన

శివసేన నేత సంజయ్​ రౌత్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు, ముఖ్యమంత్రి ఎంపికకు తమ వద్ద నంబర్లు ఉన్నాయని.. అయితే వాటిని చూపించాల్సిన అవసరం ప్రస్తుతం తమ పార్టీకి లేదని వెల్లడించారు. భాజపాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో... తమ వద్ద ఇతర ప్రత్యామ్నాయాలున్నాయని స్పష్టం చేశారు. 

15:04 November 07

గవర్నర్​తో భాజపా బృందం భేటీ

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో గవర్నర్​తో భేటీ అయింది భాజపా బృందం. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమైన నేపథ్యంలో చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అని గవర్నర్​తో మాట్లాడినట్లు పేర్కొన్నారు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​. మహాయుతి (కూటమి) ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. రెండు వారాలైనా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. భాజపా-కూటమి మధ్య సీఎం పీఠంపై చిచ్చు మొదలైంది. శివసేన 'చెరిసగం పదవీ బాధ్యతల ప్రతిపాదన'కు భాజపా అంగీకరించట్లేదు. ఫలితంగా.. రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. 

14:34 November 07

'మహా' ప్రభుత్వ తుది నిర్ణయం ఠాక్రేదే: శివసేన

మహారాష్ట్రలో 'పీట' ముడిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. రసవత్తరంగా సాగుతున్న రాజకీయాలు ఇవాళ మరింత కీలకంగా మారాయి. అసెంబ్లీ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కీలక భేటీలు నిర్వహించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఉద్ధవ్​ ఠాక్రేదేనని తీర్మానించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అనంతరం.. 2 రోజుల పాటు హోటళ్లో ఉండనున్నట్లు వెల్లడించారు. మరోవైపు భాజపా మాత్రం శివసేనతో కలిసే త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటోంది. 

మహారాష్ట్ర రాజకీయాలు హోటళ్లకు మళ్లాయి. కొద్ది రోజులుగా రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో రాష్ట్రంలో ఇవాళ కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. 

ఉద్ధవ్​ ఠాక్రేతో భేటీ అనంతరం.. తామంతా మరో రెండు రోజులు రంగ్​శార్దా హోటళ్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు పార్టీ ఎమ్మెల్యేలు. ఇది సబర్బన్​ బాంద్రాలోని పార్టీ అధినేత నివాసానికి సమీపంలోనే ఉంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో తామంతా ఒక్కచోట ఉండటం అత్యవసరమని పేర్కొన్నారు సేన ఎమ్మెల్యే గులాబ్​రావ్​ పాటిల్​. తమ అధినేత ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. 

మాతోశ్రీ నివాసంలో జరిగిన సమావేశంలో శాసనసభ్యులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఉద్ధవ్​ ఠాక్రేదేనని తీర్మానించారు. పదవీ బాధ్యతలన్నీ చెరిసగం పంచుకోవాలని పునరుద్ఘాటించారు. 

చంద్రకాంత్​ పాటిల్​ నేతృత్వంలోని భాజపా బృందం.. రాజ్​భవన్​లో గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీతో భేటీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. 

శివసేనతో కలిసే వెళ్తాం...

సీఎం పీఠం చెరిసగమని శివసేన అంటున్నా.. ఆ పార్టీతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, భాజపా సీనియర్​ నేత నితిన్​ గడ్కరీ. ఫడణవీస్​ నేతృత్వంలోనే కొత్త సర్కార్​ కొలువుతీరుతుందన్నారు. ఈ అంశంలో సేన మద్దతు తమకు లభిస్తుందని.. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆరెస్సెస్​, మోహన్​ భగవత్​ జోక్యం లేదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. 'మహారాష్ట్ర రాజకీయాల్లోకి రాదల్చుకోలేదని.. దిల్లీలోనే ఉంటానని' తేల్చి చెప్పారు.  

అంతకుముందు భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​ కూడా శివసేనతోనే కలిసి వెళ్తామని పేర్కొనడం విశేషం. మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన భాజపాకు లేదన్నారు. 

'సీఎం పీఠం' చిచ్చు...

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయి భాజపా, శివసేన పార్టీలు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజారిటీ సాధించాక.. రెండింటి మధ్య 'చెరిసగం సీఎం' పదవి చిచ్చు మొదలైంది. శివసేన ప్రతిపాదించిన ఈ అంశానికి భాజపా అంగీకరించలేదు. మొత్తం 288 స్థానాల్లో భాజపా 105, శివసేన 56 చోట్ల నెగ్గాయి. కాంగ్రెస్​, ఎన్సీపీ వరుసగా 44,54 స్థానాల్లో విజయం సాధించాయి. 

14:10 November 07

'2 రోజులు హోటళ్లో సేన ఎమ్మెల్యేలు'

ఉద్ధవ్​ ఠాక్రేతో సమావేశం అనంతరం.. శివసేన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మరో రెండు రోజుల పాటు తామంతా... హోటల్​ రంగ్​శార్దాలో ఉండనున్నట్లు పేర్కొన్నారు పార్టీ శాసనసభ్యుడు గులాబ్​రావ్​ పాటిల్​. తమ అధినేత ఠాక్రే ఏం చెప్పినా చేయడానికి సిద్ధమేనని తెలిపారు. 

14:06 November 07

గవర్నర్​తో భాజపా బృందం భేటీ

మహా రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. చంద్రకాంత్​ పాటిల్​ నేతృత్వంలోని భాజపా బృందం గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీతో సమావేశం కానుంది. ఇప్పుడే భాజపా సభ్యులు రాజ్​భవన్​ చేరుకున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

13:52 November 07

బాధ్యతలు చెరిసగం: శివసేన

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో మాతోశ్రీ నివాసంలో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉద్ధవ్​ ఠాక్రేదేనని తీర్మానించారు. ప్రభుత్వంలో పదవీ, బాధ్యతలు చెరిసగం ఉండాలని శాసనసభ్యులు పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేలను హోటల్​కు తరలిస్తున్నారన్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. 

13:42 November 07

ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్​ ఠాక్రేదే తుది నిర్ణయం: సేన

ఉద్ధవ్​ ఠాక్రే నివాసం మాతోశ్రీలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఉద్ధవ్​ ఠాక్రేదేనని తీర్మానించారు. 

12:41 November 07

ఆరెస్సెస్​తో చర్చిస్తున్నాం: గడ్కరీ

ప్రభుత్వ ఏర్పాటులో శివసేన మద్దతు సాధిస్తామని.. ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నామని అన్నారు గడ్కరీ. 

12:28 November 07

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆరెస్సెస్​తో సంబంధం లేదు: గడ్కరీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే.. ఆరెస్సెస్​, మోహన్ భగవత్​కు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు గడ్కరీ. మహారాష్ట్ర తదుపరి సీఎం తానే అని వస్తున్న వార్తలపైనా స్పందించారు.

''మహారాష్ట్రకు తిరిగివెళ్లే ప్రశ్నే లేదు..  నేను దిల్లీలోనే పనిచేసుకుంటా''

                - నితిన్​ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి

12:19 November 07

మాతోశ్రీకి చేరుకున్న శివసేన ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నేడు భాజపా బృందం గవర్నర్​ను కలవనుండగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పుడిప్పుడే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మాతోశ్రీ నిలయానికి చేరుకుంటున్నారు. 

11:59 November 07

శివసేనతో కలిసే ప్రభుత్వ ఏర్పాటు: సుధీర్​ ముంగంటీవార్​

రాష్ట్రంలో స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​. శివసేనతో కలిసే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు సుధీర్​. ఉద్ధవ్​ ఠాక్రే గతంలో.. ఫడణవీస్​ కూడా శివసైనికుడేనని అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

11:31 November 07

కీలక భేటీలతో 'మహా' ప్రతిష్టంభన వీడేనా..?

మహారాష్ట్రలో సీఎం పీఠంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ గడువు ఈ నెల 9తో పూర్తి కానున్న నేపథ్యంలో ఇవాళ కీలక భేటీలకు రంగం సిద్ధమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్ నేతృత్వంలోని బృందం ఇవాళ గవర్నర్ భగత్​ సింగ్​​ కోశ్యారీతో భేటీ కానుంది. మరోవైపు  శివసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే నేడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Last Updated : Nov 7, 2019, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details