గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చదరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార పగ్గాలు చేపట్టేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో మరాఠా రాజకీయం రంజుగా సాగుతోంది. మరాఠా రాజకీయ చదరంగంలో ఓ వైపు మోదీ- షా ద్వయం.. మరోవైపు ఎన్సీపీ అధినతే శరద్ పవార్ మోహరించారు.
సార్వత్రిక సమరం నుంచే...
సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే ఎన్సీపీతో పాటు శరద్ పవార్‌ను మోదీ- షా ద్వయం లక్ష్యంగా చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మోదీ-షా.. కాంగ్రెస్‌ను కాకుండా శరద్‌పవార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం అప్పట్లో రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యపరిచింది.
మరింత దూకుడుగా..
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి మరింత దూకుడు పెంచిన భాజపా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఆఫర్ చేసింది. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు గణేష్ నాయక్, సచిన్ ఆహిర్, భాస్కర్ జాదవ్ తదితరులను కమలదళం తమ గూటికి చేర్చుకుంది.
ఫడణవీస్ విమర్శలు..
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలోనూ భాజపా నేతలు.. శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శరద్ పవార్‌ను హిందీ సినిమా షోలేలో జైలర్‌గా పోల్చిన దేవేంద్ర ఫడణవీస్... అతనిలా పవార్ వెంట ఎవరూ నిలవరని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం... శరద్ పవార్ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతామంటూ పెద్దయెత్తున విమర్శలు చేశారు.
అమిత్ షా వర్సెస్ పవార్
అమిత్‌షా... మహారాష్ట్రకు పవార్ ఏం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐతే షా విమర్శలను బలంగా తిప్పికొట్టారు శరద్ పవార్. ఏం చేసినా ఏం చేయకపోయినా జైలుకు మాత్రం వెళ్లలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అనంతరం మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో పవార్‌కూ ఇదే పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందంటూ షా విమర్శించారు.
షా విమర్శలకు తనదైన రీతిలో బదులిచ్చారు శరద్ పవార్. ఏ సమయంలోనైనా ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. బ్యాంకులో సభ్యుడిగా కానీ, డైరెక్టర్‌గా కానీ లేని తనపై ఆరోపణలు రావడమేంటని ప్రశ్నించారు శరద్ పవార్. ఈడీ విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సిద్ధపడ్డారు. ఈ ఘటనతో మరాఠా ప్రజల్లో పవార్ పట్ల సానుభూతి వ్యక్తమైంది.
మారిన రాజకీయ వాతావరణం..
అనంతరం జరిగిన పరిణామాలతో శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించిన శరద్‌పవార్.. భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానీయమంటూ ముగింపు దశలో పవార్ చేసిన ఎన్నికల ప్రచారం... అప్పటి వరకూ మహారాష్ట్రలో నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది.
శివసేనతో ఎన్సీపీకి అవకాశం..
ఎన్నికల ఫలితాల అనంతరం భాజపా- శివసేన మధ్య విభేధాలు పొడసూపడం శరద్‌పవార్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్, శివసేనలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భాజపాతో లెక్కసరిచేసే అవకాశం లభించింది.
భాజపా వ్యూహాత్మక మౌనం
మహారాష్ట్రలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా సహా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఇన్ని రోజులు పెదవి విప్పలేదు. ఇన్నాళ్లూ వ్యూహాత్మక మౌనం వహించిన మోదీ- షా ద్వయం.. లోలోపలే తమ మంత్రాంగాన్ని నడిపారు. పవార్‌తో లెక్క సరిచేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయానికి అనుకున్నది కానిచ్చేశారు.
ఇప్పుడే పూర్తికాలేదు..!
అయితే తాజా పరిణామంతో మోదీ-షా ద్వయం మరాఠా కురువృద్ధుడికి పూర్తిగా చెక్‌పెట్టినట్టేనని భావించలేం. ఎందుకంటే శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో 30వ తేదీ జరిగే విశ్వాస పరీక్షలో దేవేంద్ర ఫడణవీస్ సర్కారు మెజారిటీని నిరూపించుకోలేదని శరద్ పవార్ బలంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్ సర్కారు మెజారిటీని నిరూపించుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
వీటన్నింటిని గమనిస్తే ఒకటిమాత్రం నిజం.. 30వ తేదీ ఏం జరిగినా మోదీ- షా ద్వయం, శరద్ పవార్‌ల ఆట ఇక్కడితో ముగియదు.
ఇదీ చూడండి: ఎన్సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్