భారత్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరువాసి ఇటీవలే అమెరికాలో పర్యటించినట్టు, పంజాబ్ వ్యక్తి ఇటలీ వెళ్లి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది.
వైరస్ నేపథ్యంలో అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బడులు తెరుచుకోవని స్పష్టం చేసింది.
ప్రభుత్వం సిద్ధం...
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు, మార్గనిర్దేశకాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు హర్షవర్ధన్. కరోనా వైరస్‌పై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు.