మా భవిష్యత్తును కోల్పోవడం అంటే ఎన్నికల్లో ... స్టాక్ మార్కెట్‌లో.. సంఖ్యలు తగ్గిపోవడంలాంటిది కాదు. మీరు కన్నబిడ్డలం మేం. మమ్మల్ని ఎటువంటి ప్రపంచంలో పెంచాలో మీరే నిర్ణయించండి. భారత ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్‌లు మూడు. 'జీరో కార్బన్ విడుదలకు వాతావరణ చట్టం తీసుకురావాలి, 'వాతావరణ మార్పులు' పేరుతో పాఠ్యాంశాలు చేర్చాలి, ప్రతి విద్యార్థి ఏటా మొక్కలను నాటేలా ప్రోత్సహిస్తూ, పెంచిన వృక్షాల ఆధారంగా డిగ్రీ ఇవ్వాలి'. భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే నా జీవితధ్యేయం. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తనవుతా. ఎందుకంటే... త్వరలో మనం నివసించే ఈ భూమి అంతరించనుంది. ఆ తరువాత మనం జీవించడానికి స్థలం కనుక్కోవడం కోసమే. చంద్రుడు, మార్స్ గ్రహాలపైకి రాకెట్‌ను పంపి, అక్కడ జీవించడం వీలవుతుందా లేదా అని తెలుసుకుంటా...
ఈ మాటలన్నది ఎవరోకాదు, ఏడేళ్లప్పుడే పర్యావరణ కార్యకర్తగా మారిన మణిపూర్‌కు చెందిన అతిచిన్న వయస్కురాలు ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం. వాతావరణాన్ని మార్చే చట్టాన్ని తెమ్మంటూ గతేడాది పార్లమెంటు ఎదుట పోరాటం చేసింది. దిల్లీలో 'ఇండియా గేట్ వద్ద 'గ్రేట్ అక్టోబరు మార్చ్'పేరుతో వేలాదిమంది మద్దతుదారులను కలుపుకొని ఏడు రోజులపాటు మార్చ్ చేసింది. విపత్తు నిర్వహణపై మన దేశం తరఫున ప్రతినిధిగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది. ఇందులో 140 దేశాలకు చెందిన మూడు వేలమంది ప్రతినిధులు హాజరవడం విశేషం. ప్రస్తుతం 'ఇంటర్నేషనల్ యూత్ కమిటీలో ఛైల్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్'కు న్యాయవాదిగా ఉంది. ఇప్పటికే 'వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్', 'ద ఇండియా పీస్ ప్రైజ్', 'డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డు'లను అందుకుంది.