సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. రాజస్థాన్ శ్రీగంగనగర్ జిల్లాలోని ఫతుహీ, రోహిడవాలీ గ్రామాల్లోకి వచ్చిన పాక్ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. ఈ ఘటన ఉదయం 5 గంటలకు జరిగింది.
డ్రోన్‌పై సైన్యం దృష్టి సారించుకుండా ఉండేందుకు సరిహద్దులో పాక్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కాల్పుల వల్ల సరిహద్దు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది.
మూడో సారి కవ్వింపు..
గత ఐదు రోజుల్లో భారత్‌లోకి ప్రవేశించిన మూడు పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 4న మొదటిసారి రాజస్థాన్‌లోని బికానేర్ సరిహద్దులోని అనూప్‌గడ్ సెక్టార్లో డ్రోన్‌ను నేలమట్టం చేశారు. అదే రాష్ట్రంలో హిందుమల్కోట్ ప్రాంతంలో భారత సైనిక స్థావరాలను పరిశీలించేందుకు శనివారం ఉదయం మరో డ్రోన్ ప్రవేశించింది. వేగంగా స్పందించిన సైన్యం ఆ డ్రోన్‌ను పేల్చేసింది.