కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఒడిశాలో ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్ అంతకు మించి అన్న రీతిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. 8 నెలల గర్భంతో ఉన్నా విధులకు హాజరవుతున్నారు.
ఇంతకీ ఆమె ఎవరంటే!
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా.. సక్రమంగా అమలు చేయడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఒడిశా మయూరభంజ్ జిల్లా బేతానాటి పోలీస్ స్టేషన్లో మహిళా సబ్ఇన్స్పెక్టర్ మమతా మిశ్రా 8 నెలల గర్భిణి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మమతా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా విధులకు హాజరవుతున్నారు. ఈ మేరకు మయూరభంజ్ను సందర్శించిన ఒడిశా డీజీపీ అభయ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కడుపులో బిడ్డను మోస్తూ విధులకు హాజరైన మమత ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు.