కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఆధ్వర్యంలోని ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు (హెచ్డబ్ల్యూసీ) సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ పథకం కింద నడుస్తోన్న 41 వేల హెచ్డబ్ల్యూసీలలో 2020, ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 8.8 కోట్ల మందికి వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇది 2018, ఏప్రిల్ 14 నుంచి 2020, జనవరి 31 వరకు 21 నెలల్లో నమోదైన సంఖ్యకు దాదాపు సమానమని తెలిపింది కేంద్రం. కరోనా మహమ్మారితో విధించిన లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ 5 నెలల్లో ఇంత భారీ సంఖ్యలో రోగులకు సేవలు అందించినట్లు వెల్లడించింది.
గత ఐదు నెలల్లో అధిక రక్తపోటు రోగులు 1.41 కోట్లు, మధుమేహ వ్యాధిగ్రస్తులు 1.13 కోట్లు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ రోగులు 1.34 కోట్ల మందిని పరీక్షించినట్లు తెలిపింది.
కరోనా సవాళ్లు విసిరినప్పటికీ.. కేవలం జూన్ నెలలోనే అన్ని హెచ్డబ్ల్యూసీ కేంద్రాల ద్వారా రక్తపోటు రోగులు 5.62 లక్షలు, మధుమేహం రోగులు 3.77 లక్షల మందికి ఔషధాలు అందించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. వీటితో పాటు కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 6.53 లక్షల యోగా, సంరక్షణ సెషన్లు నిర్వహించినట్లు పేర్కొంది.