అందం, ఆరోగ్యం కాపాడుకోడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండేవి చూసుకుని, ఎంత కష్టమైనా సరే.. సగం ఆకలిని దిగమింగేస్తాం. అయితే ఆహారం ఎంత తగ్గించినా.. భోంచేసిన వెంటనే ఈ 7 పనులు చేస్తే మాత్రం అనారోగ్యం తప్పదంటున్నారు వైద్యులు. మరి ఆ ఏడు పనులేంటో చూసేయండి.
చాయ్ మానెయ్
భారతీయులు చాయ్ ప్రియులని వేరే చెప్పనక్కర్లేదు. కడుపులో టీ పడకపోతే.. నానా హైరానా చేస్తారు. కానీ ఎంత ప్రీతికరమైనదైనా.. భోజనం చేసిన వెంటనే గరం గరం చాయ్ తాగడం ప్రమాదకరమే. టీలో ఆమ్ల గుణాలుంటాయి కాబట్టి, అది సరాసరి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న అనంతరం టీ తాగితే.. చెడు ప్రభావం చాలా ఉంటుంది. ప్రోటీన్లను టీ అరగనివ్వకుండా చేస్తుంది. అయితే.. తిన్నవెంటనే పక్కాగా టీ కావాలనుకునేవారు గ్రీన్ టీతో సరిపెట్టుకుంటే, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం.
పండ్లు తినకపోతేనే మంచిది
పండ్లు త్వరగా జీర్ణం కావు. భోజనానికి ఓ గంట ముందు పండ్లు తింటే చాలా మంచిది. కానీ తిన్న వెంటనే అంటే.. అటు ఆహారాన్ని, ఇటు పండ్లను జీర్ణం చేయడం శరీరానికి ఎంత కష్టమో పాపం.
అప్పుడే పడకుంటే ఎలా?
తిన్న తర్వాత చాలామందికి సహజంగా నిద్ర వస్తుంది. చక్కగా తినేసి పడుకుంటే.. జీర్ణవ్యవస్థ కాస్త ఇబ్బంది పడుతుంది. ఉదరంలో ఆహారం నిండి ఉన్నప్పుడు నిటారుగా ఉంటేనే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పడుకుంటే జీర్ణం కాదని, నిద్రలేచిన తర్వాత కూడా పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.