రాజస్థాన్ భరత్‌పుర్ జిల్లాలో విషాదం జరిగింది. కల్తీ మద్యం సేవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని చక్ సామరి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.
కల్తీ మద్యం సేవించి 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని భరత్‌పుర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో ఇంకా ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో మద్యం విక్రయాలకు అనుమతులు లేవని తెలిపారు జిల్లా పాలనాధికారి మహేశ్ జోషి. ఘటనపై పూర్తి విచారణ జరపాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరణాలకు గల పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.