దిల్లీ అల్లర్లపై చర్చ కోసం కొనసాగిస్తున్న ఆందోళనలు లోక్‌సభలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు దారి తీశాయి. అల్లర్లపై చర్చకు పట్టుబడుతూ లోక్‌సభలో విపక్ష సభ్యులు వరుసగా నాలుగో రోజు నిరసన కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొందరు వెల్‌లోకి వచ్చారు. సభలో చర్చకు సంబంధించిన కొన్ని కాగితాలను అధికార పక్ష సభ్యుల నుంచి లాక్కుని.. వాటిని చింపి వేశారు. దీనిని అమర్యాద ప్రవర్తనగా అభివర్ణించారు ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి. ఫలితంగా కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు గౌరవ్ గొగోయ్, టీ ఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, ఆర్.ఉన్నిత్తన్, మణికమ్ ఠాగోర్, బెన్నీ బెహ్నన్, గుర్‌మీత్ సింగ్ ఔజ్‌లాను సస్పెండ్ చేశారు. ఈ లోక్‌సభ సమావేశాలు ముగిసే వరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు మీనాక్షి తెలిపారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ - loksabha latest news
15:16 March 05
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
అంతకు ముందు విపక్షాలు దిల్లీ అల్లర్లపై చర్చ కోసం రోజంతా ఆందోళన నిర్వహించడం వల్ల సభ పలుమార్లు వాయిదాపడింది. మధ్యలో కరోనా వైరస్‌పై ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేశారు. దీనిపై చర్చ సందర్భంగా ఆర్.ఎల్.పీ ఎంపీ హనుమాన్ బేనీవాల్.. సోనియా గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితులు కనపడ్డాయి. కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రసంగించిన అనంతరం దిల్లీ అల్లర్లపై నినాదాలు చేశారు విపక్ష సభ్యులు. ఈ ఆందోళనలపై మండిపడ్డారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఇది పార్లమెంటు, బజారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.