దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా 64,531 మంది వైరస్ బారిన పడ్డారు. 1,092 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను అధిగమించింది.
భారత్‌లో కొవిడ్ నిర్ధరణ పరీక్షలను విస్తృతం చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 8 లక్షల నమూనాలను టెస్ట్ చేశారు. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 3 కోట్ల 17 లక్షలకు చేరింది.
దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు.. 1,092 మరణాలు దేశంలోనే కరోనా కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉంది మహారాష్ట్ర. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.
క్వారంటైన్ సెంటర్లలోనే అధికం
ఒడిశాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య 64,533కి చేరింది. కొత్తగా 2,239 కేసులు నమోదుకాగా.. 9 మంది మరణించారు. మృతుల సంఖ్య 362కి చేరింది. కొత్తగా గుర్తించిన కేసుల్లో 1,416 కేసులు క్వారంటైన్ సెంటర్ల నుంచే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
16 వేలకు
కేరళలో మరో 1,758 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. రాష్ట్రంలో 16,274 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 31,394 మంది కోలుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.
జమ్ము కశ్మీర్
జమ్ము కశ్మీర్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. 434 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కశ్మీర్ డివిజన్లో 346, జమ్ము డివిజన్లో 88 మందికి వైరస్ సోకినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వెల్లడించారు. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య 29,326కి పెరిగినట్లు తెలిపారు. మరణాల సంఖ్య 561కి చేరినట్లు చెప్పారు.
33 శాతం పాజిటివిటీ రేటు
పుదుచ్చేరిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 9మంది మరణించగా.. మరో 370 మంది కొవిడ్ బారినపడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 8,396కి పెరగ్గా.. మరణాల సంఖ్య 123కి చేరింది. ప్రస్తుతం 3,364 యాక్టివ్ కేసులు ఉండగా... 4,909 మంది డిశ్చార్జ్ అయ్యారు.
పాజిటివిటీ రేటు 33.45గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణల రేటు 1.46, రికవరీ రేటు 58.47కి చేరినట్లు చెప్పారు.
కేంద్ర బలగాలే అధికం
మణిపుర్లో 78 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇందులో ఐదుగురు కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 4,765కి పెరిగింది. బాధితుల్లో కేంద్ర బలగాలే 1,221మంది ఉన్నట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 58.53 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది.
అయితే, కరోనా రోగుల రికవరీ రేటు మెరుగుపడుతోంది. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా కోలుకున్నారు. మరణాల రేటులో కూడా క్షీణత కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థమైన చర్యల వల్లే ఈ మేరకు సాధ్యమైనట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!