'60 ఏళ్లు వచ్చేశాయి.. బాధ్యతలన్నీ దాదాపు తీరిపోయాయి.. ఇక హాయిగా కృష్ణా రామా అంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు' అని అనుకునే వృద్ధులకు పూర్తి భిన్నం మహారాష్ట్ర సంగ్లీకి చెందిన ప్రమోద్ లక్ష్మణ్ మహాజన్. అందుకే, ఆరు పదుల వయసును లెక్కచేయకుండా.. మోటర్ సైకిల్ యాత్ర చేపట్టారు. దేశమంతా తిరిగి అవయవ దానం గురించి వివరిస్తూ.. చనిపోయాక కూడా బతికే ఉండాలని పిలుపునిస్తున్నారు. బ్రెయిన్‌డెడ్ అయినవారి శరీరం నుంచి 8 అవయవాలను దానం చేసి 8 మంది ప్రాణాలు కాపాడగలమని చెబుతున్నారు మహాజన్.
19 ఏళ్లుగా ఒక కిడ్నీతో..
ఇప్పటివరకు 23 రాష్ట్రాల మీదగా సాగింది మహాజన్ యాత్ర. అయితే, ఇలా ప్రచారం చేసేవారంతా మాటలకే పరిమితమని, పరులకు హితబోధ చేసేవారు సొంత అవయవాలు దానం చేయలేరనే అపనమ్మకాన్ని కొట్టిపారేశారు మహాజన్. దాదాపు 2 దశాబ్దాల క్రితమే.. తన మూత్రపిండం దానం చేసి ఓ జవాను ప్రాణాలు నిలిపారు ఈ సమాజ సేవకుడు.
"2000 సంవత్సరంలో కిడ్నీ దానం చేశాను. సుమారు 19 ఏళ్లు గడిచిపోయాయి. ఒక్క కిడ్నీతోనే నేను భారత దేశమంతా బైక్‌పైనే తిరుగుతున్నాను. అవయవ దానాల పట్ల ఏవైనా అపోహలుంటే, ప్రజల మదిలోని ప్రశ్నలుంటే అవి తీర్చేస్తున్నాను. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే.. తిరిగి కోలుకునే అవకాశాలు దాదాపు ఉండవు. కాబట్టి అలాంటివారి అవయవాలు దానం చేయడం చాలా ముఖ్యం. ఇవి చెప్పడానికే నేను యాత్ర చేపట్టాను."
- ప్రమోద్ లక్ష్మణ్ మహాజన్