నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. భద్రతా దళాలు- నక్సల్స్ మధ్య జరిగే పోరుతో అక్కడి ప్రజలు నిత్యం భయంతో జీవిస్తూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. పరస్పర విభేదాలతో నక్సలైట్ల సంస్థల్లో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు జరుపుకుంటున్నారు. ఫలితంగా గత 30రోజుల్లో ఆరుగురు మవోయిస్టులు మృతిచెందారు. వీరిలో రూ. లక్ష రివార్డు ఉన్న పోడియం విజ్జ అనే నక్సలైట్ కూడా ఒకరు.
అంతర్యుద్ధంతో పాటు ప్రజలపైనా విరుచుకుపడుతున్నారు మావోయిస్టులు. అమాయకులైన గ్రామస్థులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత 60రోజుల్లో 10మందికిపైగా ప్రజలను బలిగొన్నారు. వీరిలో ఓ సర్పంచ్, ఓ అటవీశాఖ అధికారి కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
గవర్నర్ చర్యలు...
ఈ పరిణామాలపై ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతూ రాష్ట్ర హోంమంత్రి తమ్రధ్వాజ్ సాహుకు లేఖ రాశారు.
నక్సలైట్ల ఉదంతంపై సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు గవర్నర్. హోంశాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది.