చెరువును తలపిస్తున్న ముంబయి విమానాశ్రయం ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్ర కుదేలవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, గ్రామాలను వరద ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాసిక్ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంగాపుర్ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా... దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
కల్యాణ్ దోంబివిల్, భీవండి, ఉల్హాస్, ఠాణె, రాజ్‌గడ్ వంటి నగరాలు, పరిసర గ్రామాలు నీట మునిగాయి. పడవలు, ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రంగంలోకి ఎమ్ఐ-17 హెలికాఫ్టర్...
మహారాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు భారత వైమానిక దళం ఎమ్ఐ-17 హెలికాఫ్టర్‌ను సహాయ చర్యలకు ఉపయోగిస్తోంది. నావికా దళానికి చెందిన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యానికి చెందిన మరో 120 మందిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 58 మందిని భారత వైమానిక దళం అధికారులు వాయుమార్గం ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వరదలో ముంబయి విమానాశ్రయం...
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టాలపై నీరు చేరి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరద నీరు చేరి విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
పుణెలో 500 కుంటుంబాల తరలింపు...
భారీ వర్షాలకు మహారాష్ట్రలోని రెండో ప్రధాన నగరం పుణెను వరదలు ముంచెత్తాయి. ముథ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పుణె పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిసర గ్రామాల్లోని సుమారు 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చూడండి: వరుణ బీభత్సం- మహారాష్ట్ర, గుజరాత్ జలదిగ్బంధం