ఎన్నికల్లో పారదర్శకత కోసం పార్లమెంట్లో పలు నియమాలను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు.. తమ ఆస్తుల వివరాలు లోక్‌సభ సచివాలయానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే.. 2019 మే లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 503 మంది.. తమ ఆస్తుల వివరాలను సమయంలోపు అందించలేదు. కేవలం 36 మంది ఎంపీలు తమ, తమపై ఆధారపడే వారి స్థిర, చరాస్తుల వివరాలను తెలియజేశారు.
స.హ చట్టం ద్వారా వెలుగులోకి
లోక్‌సభ సభ్యుల ఆస్తుల వివరాలపై ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్కు చెందిన నదీమొద్దిన్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన దరఖాస్తుకు సమాధానంగా లోక్‌సభ సచివాలయం.. 2019 డిసెంబర్ 10 నాటికి ఎంపీల ఆస్తుల వివరాలను అందించింది.
వివరాలు అందించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా భాజపాలో 25 మంది, తృణమూల్ కాంగ్రెస్-8, బీజేడీ-1, శివసేన-1, ఏఐడీఎంకే నుంచి ఒకరు ఉన్నారు.
కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల సీనియర్ నేతలు ఇంకా తమ ఆస్తుల వివరాలు తెలియజేయలేదు.