ఆసియాలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్లలో ఒకటైన కోయంబేడులో కరోనా మళ్లీ కలవరం రేపుతోంది. రెండు వారాల క్రితమే తెరుచుకున్న ఈ మార్కెట్లో సోమవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 50మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వైరస్ సోకినవారిలో ఎక్కువమంది విక్రేతలే ఉన్నట్టు తెలిపారు.
మార్కెట్ తెరచినప్పటి నుంచి మొత్తం 3500పైగా నమూనాలు పరీక్షించినట్టు పేర్కొన్నారు అధికారులు. రోజూ సుమారు సుమారు 200మందిని టెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. సరకుతో వాహనాలు వస్తున్నందున మార్కెట్‌లో నిత్యం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు చెన్నై పురపాలక శాఖ అధికారులు తెలిపారు. విక్రేతలకు నిరంతరం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా నాలుగు బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలిపారు.