తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్‌ అంకుల్‌‌.. లాక్‌డౌన్‌లో ట్యూషన్‌ చెబుతున్నారు! - పోలీస్‌ అంకుల్‌‌

లాక్​డౌన్​ వేళ పిల్లలకు ట్యూషన్​ చెబుతున్నారని ఓ టీచర్​పై విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన పంజాబ్​లోని గుర్​దాస్​పుర్​ జరిగింది. ఆ పిల్లాడి మామయ్య ట్యూషన్​ నుంచి తీసుకొని వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వివరాలు అడగగా వారిని టీచర్​ ఇంటికి తీసుకొని వెళ్లాడా బుడతడు.

5 year old inform police about tution teacher taking classes during lockdown
పోలీస్‌ అంకుల్‌‌..లాక్‌డౌన్‌లో ట్యూషన్‌ చెబుతున్నారు!

By

Published : Apr 27, 2020, 4:20 PM IST

చదువుకునే పిల్లలు సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అలాంటిది లాక్‌డౌన్‌ పేరిట సుదీర్ఘ సెలవులు రావడం వల్ల పిల్లలంతా ఇంట్లో ఆనందంగా గడుపుతున్నారు. అయితే, బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడం కాస్త వారిని బాధపెడుతున్నప్పటికీ.. పాఠాల నుంచి తప్పించుకొని ఇంట్లోనే ఆటా-పాటా ఉన్నందుకు మాత్రం సంతోషిస్తున్నారు. అయితే, ఈ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్ల పేరిట వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో కోపంతో ఉన్న ఓ ఐదేళ్ల బాలుడు ట్యూషన్‌ చెప్పే టీచర్‌ అడ్రస్‌ పోలీసులకు చెప్పిన సంఘటన పంజాబ్‌లోని గుర్​దాస్‌పుర్‌లో జరిగింది.

పోలీస్‌ అంకుల్‌‌..లాక్‌డౌన్‌లో ట్యూషన్‌ చెబుతున్నారు!

గుర్​దాస్‌పుర్‌లో ఓ ఇద్దరు పిల్లల్ని వారి మామయ్య కొంత దూరంలో ఉన్న ట్యూషన్‌ టీచర్‌ ఇంటి నుంచి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా... ట్యూషన్‌ గురించి ఆ పిల్లల మామయ్య చెప్పేశాడు. టీచర్‌ అడ్రస్‌ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. ఇంతలో ఆ పిల్లల్లో ఒకరైన ఐదేళ్ల బాలుడు టీచర్‌ ఇంటివైపు వేలు పెట్టి చూపించాడు. చెప్పొద్దని మామయ్య ఎంత వారించినా ఊరుకోలేదు. సెలవుల్ని ఆనందంగా గడపనివ్వట్లేదని ఎక్కడో కోపం ఉన్నట్లుంది! అంతటితో ఆగకుండా నేరుగా టీచర్‌ ఇంటికే తీసుకెళ్లాడు.

పోలీసులు టీచర్‌ను బయటకు పిలిచి వివరాలు అడగ్గా.. ట్యూషన్‌ చెప్పలేదని ఆమె బుకాయించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆ బాలుడు లోపల ఉన్న మరో ముగ్గురు పిల్లల్ని పోలీసులకు చూపించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇక చేసేది లేక ఆ టీచర్‌ తప్పును అంగీకరించారు. లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు ట్యూషన్లు చెప్పనని హామీ ఇచ్చారు. ఇది మరోసారి జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలేశారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details