దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వ్యవహారంతో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మర్కజ్‌ను దర్శించిన వారిని గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కలిసి ప్రయాణం చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. తబ్లీగీ జమాత్ నుంచి సొంత రాష్ట్రాలకు వెనక్కి వచ్చేందుకు అవకాశమున్న ఐదు రైళ్ల ప్రయాణికుల వివరాలు వెలికితీస్తోంది.
మార్చి 13 నుంచి 19 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు దురంతో, చెన్నైకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, దిల్లీ-రాంచీ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్, ఏపీకి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లు నడిచాయని గుర్తించారు అధికారులు. మర్కజ్లో పాల్గొన్నవారు ఈ రైళ్లలో వెళ్లే అవకాశం ఉన్న కారణంగా ప్రయాణికుల జాబితాను వెలికితీసే పనిలో పడ్డారు. ఒక్కో రైలులో 1000 నుంచి 1200మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని.. వారంతా వైరస్ సోకే ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడించారు. రైల్వే అధికారులు అందించే జాబితాతో ఆయా జిల్లాల్లో ఉన్న అధికారులు మర్కజ్లో పాల్గొన్నవారి వివరాలను సరిపోలుస్తారని వెల్లడించారు అధికారులు. దీనిద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ చేపడతారని వివరించారు.
తెలంగాణలో ఇండోనేషియన్లు..
ఇలా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ద్వారానే తెలంగాణ కరీంనగర్లో పదిమంది ఇండోనేషియన్లను గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం వారికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలిందని గుర్తు చేశారు.