దేశవ్యాప్త లాక్డౌన్ సహా కరోనా కట్టడికి కేంద్రం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా దాదాపు 38వేల మందికి ప్రాణ ముప్పు తప్పిందని చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అలాగే 14నుంచి 29లక్షల మందిని వైరస్ బారిన పడకుండా కాపాడినట్లు లోక్‌సభలో వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 92 శాతం మందికి వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో 5.8 శాతం మందికే ఆక్సిజన్ థెరపీ, కేవలం 1.7 శాతం మందికి ఐసీయూ అవసరమని స్పష్టం చేశారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోక్‌సభలో వివరించారు హర్షవర్ధన్. దేశంలో 60 శాతం కొవిడ్-19 కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ నుంచే వస్తున్నట్లు వెల్లడించారు.
కరోనా ప్రభావిత దేశాలతో పోలిస్తే భారత్లో వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని హర్షవర్ధన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రతి పది లక్షల జనాభాకు 3,328 కేసులు, 55 మరణాలు సంభవిస్తున్నట్లు వివరించారు. కరోనా కట్టడి విషయంలోనూ భారత్ మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు.