ఉత్తరాది రాష్ట్రాలు బిహార్, అసోంలలో వరదల బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే రెండు రాష్ట్రాల్లో 9 మంది మృతి చెందారు. ఫలితంగా మృతుల సంఖ్య 207కు చేరింది. బిహార్లో 13, అసోంలో 17 జిల్లాల్లో జల విలయం కొనసాగుతోంది.
వరదల ధాటికి బిహార్లో 127 మంది, అసోంలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.
అసోం..
రాష్ట్రంలోని కురిచ్చు నది ఉద్ధృతితో బార్పేట, నల్బారి, బక్సా, చిరాంగ్, కొక్రాఝర్, దుబిడీ, దక్షిణ సల్మారా జిల్లాలు నీట మునిగాయి. 17 జిల్లాల్లోని 2,078 గ్రామాల్లో సుమారు 27.15 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 768 శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర, జియా భరాలి, పుథిమరి, మనాస్, బేకి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.