'కశ్మీర్'పై నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ1 ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు సంబంధించి దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది సుప్రీం కోర్టు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చెల్లుబాటు, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేటి నుంచి విచారణ చేపట్టనుంది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.
ఆర్టికల్ 370పై దాఖలైన పిటిషన్లను పెద్ద ధర్మాసనానికి బదిలీ చేస్తామని ఈనెల 28న సుప్రీం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
త్రిసభ్య ధర్మాసనం..
ఆర్టికల్ 370 రద్దు అనంతరం చెలరేగిన సమస్యలకు సంబంధించిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇలాంటి వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.
కశ్మీర్ లోయలో మైనర్లను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలపై జమ్ముకశ్మీర్ హైకోర్టుకు చెందిన జువెనైల్ జస్టిస్ కమిటీ నివేదిక అందినట్లు తెలిపింది. నివేదికను త్రిసభ్య ధర్మాసనానికి పంపనున్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, పిల్లల హక్కుల కార్యకర్తలు ఎనాక్షి గంగూలి, శాంత సిన్హాలకు తెలియజేసింది ధర్మాసనం.
కశ్మీర్లో ఆంక్షల నేపథ్యంలో మందులు, వైద్య సౌకర్యాలు అందటం లేదని ఓ వైద్యుడు దాఖలు చేసిన వ్యాజ్యం, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భాసిన్ పిటిషన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ వ్యాజ్యంపైనా త్రిసభ్య ధర్మాసనమే విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.
కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా..
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొదటిగా న్యాయవాది ఎంఎల్ శర్మ ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేశారు. అనంతరం రాజకీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎం పిటిషన్లు దాఖలు చేశాయి. వారితో పాటు మాజీ రక్షణ శాఖ అధికారులు, ప్రతినిధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఇదీ చూడండి: మృత్యువును ప్రేమించిన జగత్ప్రేమికుడు... మహాత్ముడు