భారీ వర్షాలు, వరదలతో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లు అతలాకుతలమవుతున్నాయి. యూపీ వ్యాప్తంగా పిడుగుపాటుకు 23మంది చనిపోయారు. మరో 29మంది గాయపడ్డారు. బిహార్‌లోని 5 జిల్లాల్లో పిడుగులు పడి 20మంది మృత్యువాతపడ్డారు. పట్నాలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బిహార్ వ్యవసాయశాఖ మంత్రి ప్రేమ్ కుమార్ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.
అసోంలో 37కు చేరిన మృతులు..
అసోంలో వరదల కారణంగా శనివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 37కు చేరింది. 13 లక్షల మందికిపైగా వరదల వల్ల ప్రభావితమయ్యారు. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.