దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి చాలా మంది ఒత్తిడికి గురవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఐదు నెలల కాలంలో ఒత్తిడితో బాధపడుతున్నవారి సంఖ్య 43 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇందుకు లాక్డౌన్ కూడా ఓ కారణమని వివరించింది.
సుమారు 10 వేల మంది భారతీయులపై ప్రముఖ ఆరోగ్య వేదిక 'గోఖీ' అధ్యయనం చేసింది. ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారో పరిశోధన చేసింది. నిద్ర సమయం, ఆసక్తులు, పనులు, శక్తి వంటి 9 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించింది.
43 శాతం మంది..
ఇందులో 26 శాతం మంది స్వల్ప ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. 11 శాతం మధ్యస్థ, 6 శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలిపారు.
ఈ కాలంలో సుమారు 59 శాతం మంది కొన్ని విషయాల్లో స్వల్ప ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. 38 శాతం కొద్ది రోజుల పాటు ఆందోళన చెందినట్లు స్పష్టం చేశారు. 9 శాతం మంది సగం రోజులు, 12 శాతం మంది పూర్తికాలం ఆందోళనలోనే ఉన్నట్లు వెల్లడించారు. మరో 57 శాతం మంది అలసట, అశక్తతగా భావించినట్లు తెలిపారు.